ట్రంప్ పై వీగిపోయిన అభిశంసన

By రాణి  Published on  6 Feb 2020 10:58 AM GMT
ట్రంప్ పై వీగిపోయిన అభిశంసన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వచ్చిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. అభిశంసన అభియోగాల నుంచి ట్రంప్ విముక్తి పొందారు. అధికార రిపబ్లికన్ పార్టీ ఆధిక్యంలో ఉన్న సెనెట్ అధ్యక్షుడిపై వచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వచ్చిన అభియోగం 52-48 ఓట్ల తేడాతో వీగిపోయింది. అలాగే అమెరికన్ కాంగ్రెస్ విధులకు ట్రంప్ ఆటంకం కలిగించారన్న అభియోగం కూడా 53-47 ఓట్ల తేడాతో వీగిపోయింది. కానీ దీనిపై ట్రంప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తనపై వచ్చిన అభిశంసన తీర్మానం వీగిపోవడంపై శుక్రవారం స్పందిస్తానని వెల్లడించారు. అలాగే దీనిపై అమెరికా కాలమానం ప్రకారం (గురువారం మధ్యాహ్నం 12 గంటలకు, భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు) శ్వేత సౌధం నుంచి అధికారిక ప్రకటన చేస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అభిశంసనపై మన దేశం విజయం సాధించిందని ఆ ట్వీట్ లో రాశారు.గతేడాది డిసెంబర్ 18వ తేదీన అమెరికా ప్రతినిధుల సభ అధ్యక్షుడు ట్రంప్ పై అభిశంసన అభియోగాన్ని మోపగా..ఎక్కువమంది డెమోక్రాట్లు ఆధిక్యంతో ఉండటంతో ఈ తీర్మానం సభ ఆమోదాన్ని పొందింది. అనంతరం దీనిని ప్రతినిధుల సభ సెనెట్ కు పంపగా..అక్కడ జరిగిన ఓటింగ్ లో రిపబ్లికన్ సభ్యులంతా ట్రంప్ కే మద్దతిచ్చారు. దీంతో ఆ తీర్మానం కాస్తా వీగిపోయింది.

ఈ ఏడాది జరగనున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు డెమోక్రటిక్ నేత జోయ్ బిడెన్ నుంచి గట్టి పోటీ రానుంది. ఈ నేపథ్యంలో బిడెన్ ను ఎన్నికలకు రాకుండా దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ సహాయం కోరినట్లుగా ట్రంప్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్ చేసే సహాయానికి ప్రతిఫలంగా ఆర్థిక సహాయం అందిస్తానని, బిడెన్, అతని కుమారుడిపై అవినీతి కేసు దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు ట్రంప్ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడితో ఫోన్ మాట్లాడినట్లు అక్కడి నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు.

Next Story