టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవి తమ నేతకు ఇవ్వలేదని మనస్తాపంతో బుధవారం ఒంటి పై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు ఓ కార్యకర్త. మున్సిపల్‌ ఎన్నికల్లో సూర్యాపేట పట్టణం ఐదో వార్డు నుంచి స్థానిక టీఆర్‌ఎస్‌ నేత బాషా భాయ్‌ గెలుపొందారు.

సూర్యాపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ వశం కావడంతో ఆయనకు వైస్‌ చైర్మన్‌ పదవి వస్తుందని భావించారు. అయితే, చివరి నిమిషంలో బాషాకు పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరుడు ఒంటిమీద పెట్రోల్‌ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. గమనించిన చుట్టు పక్కల ఉన్న కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎంపీపీ లింగయ్య యాదవ్ అక్కడకు చేరుకుని కార్యకర్తను సముదాయించారు.

కాగా మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 18 పురపాలికల్లో టీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలను దక్కించుకుంది. మొత్తం పోలైన ఓట్లలో టీఆర్ఎస్ 45 శాతం ఓట్లు సాధించింది. చండూరు పురపాలిక మినహాయించి మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ ఛైర్మన్‌లుగా టీఆర్ఎస్‌కు చెందిన వారే ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం నాటికి 16 పురపాలికల్లో టీఆర్ఎస్ గులాబీ జెండా పాతగా, మంగళవారం జరిగిన నేరేడుచర్ల ఛైర్మన్ ఎన్నికలోనూ అధికార పార్టీ సభ్యుడే కైవసం చేసుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.