తాజా ఫ్యాషన్ ట్రెండ్ : మగ నెయిల్ పాలిష్ తో మహా విప్లవం

By రాణి  Published on  10 Feb 2020 8:31 AM GMT
తాజా ఫ్యాషన్ ట్రెండ్ : మగ నెయిల్ పాలిష్ తో మహా విప్లవం

సుప్రసిద్ధ ఫిలిం స్క్రిప్టు రైటర్ వరుణ్ గ్రోవర్ కొత్త స్టైల్ చూసి అంతా డంగైపోయారు. అమ్మాయిల్లా గోళ్లు అందంగా పెంచుకుని, వాటికి ఇంకా అందమైన నెయిల్ పాలిష్ వేసి వాటితో సహా ఫోటో దిగి ఇన్ స్టాగ్రామ్ లో హొయలు ఒలకబోస్తూ గ్రోవర్ ప్రత్యక్షమయ్యాడు. “ ఎంత కూల్” అనేవారు కొందరైతే, “ఏంటీ గోల” అనేవారు ఇంకొందరు. గ్రోవర్ మాత్రం “నా అందం రహస్యం ఈ అందమైన గోళ్ల పెయింటే” అని సినీ తారక స్టయిల్లో ప్రకటించేశాడు.

మనకింకా కొత్తేమో కానీ పాశ్చాత్యంలో మగాళ్లు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఒక పెద్ద క్రేజీ స్టయిల్. ఒకప్పుడు కౌంటర్ కల్చర్ లీడర్లు ఈ తరహా నెయిల్ పాలిష్ లు వేసుకుని “ఆడాళ్ల అధికారాన్ని” భగ్నం చేశారు. మగాళ్ల “పాత చింతకాయ పచ్చడి” ఆలోచనల్ని సవాలు చేశారు. ఇప్పుడు ఇది నెమ్మదిగా అలవాటైపోయింది. చాలా మంది ఫేషన్ ఐకాన్లు, స్టార్లు, సెలబ్రిటీలు, హాలీవుడ్ పర్సనాలిటీలు కూడా మగ గోళ్ల పెయింటింగ్ లు వేసుకుని తమ నవనాగరికాన్ని ప్రదర్శిస్తున్నారు. సుప్రసిద్ధ ఫ్యాషన్ మాగజైన్ ఎస్క్వేర్ 2020 ను మానిక్యూర్ ఇయర్ గా అంటే గోళ్ల సౌందర్య సంవత్సరంగా ప్రకటించేసింది. మరొక సుప్రసిద్ధ నెయిల్ పాలిష్ సంస్థ ఓ పీ ఐ 2019 లోనే “విల్ యూ మెన్ అప్” అని మగాళ్లు నెయిల్ పాలిష్ వేసుకోవడాన్ని ప్రోత్సహించే సరికొత్త కాంపెయిన్ కి తెరతీసింది.

మన దేశంలో మగాళ్లు నెయిల్ పాలిష్ వేసుకుంటే అంతా వింతగా చూస్తారు. వెక్కిరించి వేళాకోళం చేస్తారు. కాబట్టి మగతనం విషయంలో ఇలాంటి “పిచ్చి పిచ్చి” పోకడలు మానుకోవాలని చెప్పే ప్రయత్నంలో భాగంగానే తాను చేతి వేళ్లకు పాలిష్ వేసుకున్నట్టు వరుణ్ గ్రోవర్ చెప్పాడు. మగ, ఆడ తేడాలను రూపుమాపే ఘన ప్రయత్నంలో భాగంగా తానీ పనిని చేశానని ఆయన చెబుతున్నాడు.

Next Story