రజనీ సినిమాలో ట్రాన్స్ జెండర్ మ్యూజికల్ బ్యాండ్ పాట

By అంజి  Published on  4 Dec 2019 10:46 AM GMT
రజనీ సినిమాలో ట్రాన్స్ జెండర్ మ్యూజికల్ బ్యాండ్  పాట

అదొక మ్యూజికల్ బ్యాండ్. అందులో ప్రత్యేకత ఏముంది? ఎన్నో మ్యూజిక్ బ్యాండ్లు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ మ్యూజిక్ బ్యాండ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఒక ట్రాన్స్ జెండర్ మ్యూజిక్ బ్యాండ్. ఇందులో సభ్యులందరూ ట్రాన్స్ జెండర్లే. అంతే కాదు. వీరి మ్యూజిక్ బ్యాండ్ ఇప్పుడొక అరుదైన ఎచీవ్ మెంట్ సాధించింది. అదేమిటంటే తలైవా రజనీకాంత్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పాడే అవకాశాన్ని దక్కించుకుంది.

మురుగదాస్ దర్శకత్వంలో రజనీ కాంత్ తాజా చిత్రం 'దర్బార్' లో ఈ ట్రాన్స్ జెండర్ బృందం ఒక పాట పాడింది. ఈ బృందంలోని చంద్రముఖి, రచనా ముద్రబోయిన, ప్రియా మూర్తిలు ఈ పాట పాడారు. ఈ పాటనే ఈ మధ్యే చెన్నైలో రికార్డింగ్ చేశారు. ఈ సినిమాలో ట్రాన్స్ జెండర్లపై ఒక పాట ఉంది. ముందు దీనిని మామూలు సింగర్ కాస్త గొంతు మార్చి పాడితే చాలనుకున్నారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మాత్రం సరైన ఫీల్ రావాలంటే ట్రాన్స్ జెండర్లే ఈ పాట పాడాలని పట్టుబట్టాడు. అతని మిత్రుడు, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ బ్యాండ్ గురించి చెప్పడంతో, అనిరుద్ధ వారిని పిలిపించాడు.

రచన, ప్రియ, చంద్రముఖిలు స్పైసీ గర్ల్స్ అనే పేరిట హైదరాబాద్ లో ఒక బ్యాండ్ ను నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ హక్కుల ఉద్యమంలో వీరిది కీలక పాత్ర, సెమినార్లు, కాన్ఫరెన్సుల్లో పాటలు కూడా పాడుతుంటారు. వీరికి కాసింత సంగీత జ్ఞానం కూడా ఉంది. దాంతో అనిరుద్ధ ముందుటెలిఫోన్ లో ఆడిషన్ చేశాడు. ఆ తరువాత వాట్సప్ విడియో ఆడిషన్ జరిగింది. ఆ తరువాత అంతా ఒకే అనుకున్నాక అసలు రికార్డింగ్ జరిగింది. స్పైసీ గర్ల్స్ ఈ పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాడారు.

అనిరుద్ధ్ తమ చేత ఎంతో ప్రాక్టీస్ చేయించాడని, తాను కోరుకున్న ఫీల్ వచ్చే దాకా పాడించాడని చంద్రముఖి చెప్పింది. ఒక రిహార్సల్ అయిన తరువాత అంతా బాగుంది అని భుజం తట్టేవాడు. కానీ తరువాత నెమ్మదిగా ఇలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండేది. మరో సారి ట్రై చేద్దామా అని అడిగేవాడని ఆమె చెప్పింది. అయితే తమకు తలైవా రజనీకాంత్ ఆశీర్వాదం ఉందని, అది ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఇలాగే ట్రాన్స్ జెండర్లను మిగతా సమాజాన్ని కలపాలని ఆమె సూచించారు. తమ పాట ను జనవరి 2020 లో విడుదలయ్యాక వినవచ్చునని ఆమె అన్నారు. ఇది తమకు నిజమైన న్యూయియర్ గిఫ్ట్ అని ఆమె అన్నారు.

Next Story