కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 355 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఏడుగురు ఈ వైరస్‌ భారిన పడి మృతి చెందారు. ఇప్పటికే దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈనెల 31 వరకు అన్ని ఫ్యాసింజర్‌ రైళ్లు, మెట్రో, అంతరాష్ట్ర బస్సు సర్వీస్సులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్‌ భారిన పడి ఇప్పటికే దేశంలో ఏడుగురు మరణించిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం అర్థరాత్రి నుంచి మార్చి 31 అర్థరాత్రి వరకు అన్ని ఫ్యాసింజర్‌ సర్వీస్సులనూ రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కేవలం గూడ్స్‌ రైళ్లు మాత్రమే నడవనున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రారంభమైన రైళ్లును మాత్రం వాటి గమ్యస్థానాలకు చేరే వరకు అనుమతిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. అంతరాష్ట్ర బస్సు సర్వీస్సులను నిలిపివేయాలని కేంద్రం సూచించింది. అవసరమైన ప్రయాణాలకు మాత్రమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మెట్రో రైళ్లుసైతం 31 అర్థరాత్రి వరకు నిలిచిపోనున్నాయి. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇప్పటికే మెట్రో రైళ్లు తిరగడం లేదు. ఇదిలా ఉంటే కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాజిటివ్‌ కేసులు నమోదైన 75 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో తెలంగాణ, ఏపీకి చెందిన జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలు ఉన్నట్లు సమాచారం. తాజాగా విజయవాడలోనూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో బెజవాడ నగరాన్ని కూడా మర్చి 31 వరకు లాక్‌ డౌన్‌ చేసే అవకాశం ఉంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.