నేడు తిరుమలకు సీఎం వైఎస్ జగన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 5:31 AM GMT
నేడు తిరుమలకు సీఎం వైఎస్ జగన్

తిరుపతి: శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతికి వస్తున్నారు. తిరుపతి, తిరుమలలో రెండు చొప్పున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయాన్ని ప్రారంభిస్తారు. దీనిని ఏపీ టూరిజానికి టీటీడీ అప్పగించనుంది. ఇందులో 200 గదులు ఉన్నాయి. సాయంత్రం 4.15గంటలకు ‘అలిపిరి- చెర్లోపల్లె’ జంక్షన్‌లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి తిరుమలకు బయలుదేరుతారు.

సాయంత్రం 5.15 గంటలకు తిరుమలలోని నందకం అతిథిగృహం వద్ద మాతృశ్రీ వకుళాదేవి వసతి సముదాయాన్ని ప్రారంభిస్తారు. దీనిని రూ.42.86 కోట్లతో.. ఐదు అంతస్తులతో.. 270 గదులతో టీటీడీ నిర్మించింది. రూ.79 కోట్లతో నిర్మించనున్న యాత్రికుల వసతి సముదాయానికి శిలాఫలకం ఆవిష్కరిస్తారు. అనంతరం..శ్రీ పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొని తిరుమలలో బస చేస్తారు. మంగళవారం ఉదయం 9.40 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు

Next Story