అమెరికాలో టోర్నడోల విధ్వంసం.. 22 మంది మృతి
By అంజి Published on 4 March 2020 2:56 AM GMT
ముఖ్యాంశాలు
- అమెరికా: టెన్నెస్సీ రాష్ట్రంలో విరుచుకుపడ్డ టోర్నడోలు
- నాష్‌విల్లే సహా తదితర ప్రాంతాల్లో టోర్నడోల బీభత్సం
- సుమారు 22 మంది మృతి చెందినట్టు అధికారుల ప్రకటన
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెన్నెసీ రాష్ట్రంలో సుడిగాలులు విరుచకుపడుతున్నాయి. ఈ టోర్నడోల వల్ల సుమారు 22 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం అధికారులు సిబ్బందితో కలిసి గాలిస్తున్నారు. చాలా మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని అక్కడి అధికారులు తెలిపారు. నాష్‌విల్లే సహా తదితర ప్రాంతాల్లో టోర్నడోలు వణికిస్తున్నారు.
టోర్నడోల వల్ల 40కిపైగా భవనాలు నేల కూలాయని ది వెదర్ ఛానల్ తెలిపింది.. అనేక చెట్లు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లేకపోవడంతో అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
టెన్నెస్సీలోని ఎయిర్‌పోర్టును, కోర్టులను, స్కూళ్లను అధికారులు మూసివేశారు. కాగా టోర్నడోల బీభత్సం కారణంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఆ రాష్ట్ర గవర్నర్ బిల్ లీ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టోర్నడోల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు హెలికాప్టర్ల ద్వారా సర్వే చేస్తున్నారు.