రేపే వినాయక చవితి, విగ్రహం ఎప్పుడు ప్రతిష్టించాలంటే..

హిందూ సాంప్రదాయంలో వినాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

By Srikanth Gundamalla  Published on  6 Sept 2024 9:15 AM IST
రేపే వినాయక చవితి, విగ్రహం ఎప్పుడు ప్రతిష్టించాలంటే..

హిందూ సాంప్రదాయంలో వినాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటారు. ప్రతి ఏడాది భాద్ర‌ప‌ద మాసం శుక్ల‌ప‌క్ష చ‌వితి రోజున దేశ వ్యాప్తంగా వినాయ‌క చ‌వితిని జరుపుతారు. ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 7వ తేదీన వినాయ‌క చ‌వితి వ‌చ్చింది. అయితే ఏ స‌మ‌యంలో వినాయ‌కుడిని పూజించాలి..? వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన సమయంలో వస్త్రాలు ధరించాలి..? పూజా వివరాలను తెలుసుకుందాం. లంబోద‌రుడి కృప ఉంటే అన్నీ విజ‌యాలే వ‌రిస్తాయ‌నే న‌మ్మ‌కం భ‌క్తుల్లో ఉంది. కాబ‌ట్టి ఏ శుభ‌కార్యం ప్రారంభించినా.. తొలి పూజ విఘ్నేశ్వ‌రుడితో ఆరంభిస్తారు.

సెప్టెంబ‌ర్ 7వ తేదీ వినాయ‌క చ‌వితి రోజున ఉద‌యం 11:03 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు పూజ‌లు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో వీలుకాక‌పోతే సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. ఈ రెండు స‌మ‌యాల్లో విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించి, ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అన్నీ శుభాలే జ‌రుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు. గ‌ణేశుడికి ఎరుపు రంగు వ‌స్త్రాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి వినాయ‌క చ‌వితి రోజున ఆ రంగు వ‌స్త్రాలు ధ‌రిస్తే మంచిద‌ని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది వినాయ‌క చ‌వితి శ‌నివారం రోజున వ‌చ్చింది. శ‌నివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి.. ఆయనకు ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని అంటున్నారు పండితులు. కాబట్టి పండగ నాడు ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.

వినాయ‌క చ‌వితి రోజున జిల్లేడు ఒత్తుల దీపం వెలిగిస్తే మంచిద‌ని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ప్రమిదలో కొబ్బరినూనె పోసి ఐదు జిల్లేడు ఒత్తులు విడిగా వేసి... దీపం పెడితే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంద‌ట‌. అలాగే పండగ నాడు 21 పత్రాలతో గణపతిని పూజించడం వీలుకాని వారు.. దుర్వాయుగ్మం అంటే గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పిస్తే 21 ప్రతాలతో ఆయనను పూజించిన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు అందుకునే వినాయకుడు ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు భక్తులు.

Next Story