తగ్గనున్న వందేభారత్ టికెట్ ధరలు..కానీ తెలుగు రాష్ట్రాల్లో!
వందేభారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 July 2023 6:40 PM ISTతగ్గనున్న వందేభారత్ టికెట్ ధరలు..కానీ తెలుగు రాష్ట్రాల్లో!
వందేభారత్ రైళ్లను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. విమానంలో ఉండే సౌకర్యాలనే వీటిల్లోనూ కల్పించింది. ఇక అత్యంత వేగంతో గమ్యస్థానాలకు చేర్చడమే ఈ వందేభారత్ రైళ్ల లక్ష్యం. అయితే.. విలాసవంతమైన సౌకర్యాలు, హైస్పీడ్ దేవుడెరుగు కానీ.. టికెట్ ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో.. కొన్ని చోట్ల వందేభారత్ ఆక్యుపెన్సీ ఆశించినంతగా లేదు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
టికెట్ ధరలను తగ్గిస్తామని చెబుతూనే.. ఇండియన్ రైల్వేస్ ఒక మెలిక పెట్టింది. అన్ని రూట్లలో ఈ ధరలు తగ్గించరట. తక్కువ దూరం ఉండే మార్గాల్లోనే టికెట్ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ భావిస్తోంది. టికెట్ ధరల తగ్గింపు తెలుగు రాష్ట్రాలకు అమలు కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు. తక్కువ దూరం అంటే ఇండోర్-భోపాల్ మధ్య వందే భారత్ రైలు ప్రయాణ సమయం 3 గంటలు మాత్రమే. అంతేకాక ఈ రూట్లో 21 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుందట. దీంతో.. ఇలా ఆక్యుపెన్సీ తక్కువగా ఉండి, తక్కువ దూరం ఉన్న మార్గాల్లో టికెట్ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆక్యుపెన్సీ బాగా ఉన్న రూట్లలో ధరలు అలాగే కొనసాగించాలని ఆలోచిస్తున్నారు అధికారులు. కాగా... తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు రూట్లలో వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ మార్గాల్లో ఆక్యుపెన్సీ బాగానే ఉంది. దీంతో.. టికెట్ ధరలు ఇక్కడ తగ్గించే అవకాశం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-పూణె మధ్య వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రూట్లలోనూ టికెట్ ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది.