మరో వందేభారత్ రైలు, విశాఖ-తిరుపతి మధ్యేనా?

తెలుగు రాష్ట్రాలకు మరో వందేబారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వస్తుందని ప్రచారం జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  21 Aug 2023 5:52 AM GMT
vande bharat express, vizag-tirupati, railway,

మరో వందేభారత్ రైలు, విశాఖ-తిరుపతి మధ్యేనా?

వందే భారత్‌ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు మార్గాల్లో ఈ వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. తొందరగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా వందేభారత్‌ రైళ్లను కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో విమానంలో ఉండేటువంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. అన్ని సదుపాయాలు బాగానే ఉన్నా.. కొన్నిచోట్ల మాత్రం ఈరైలుకు అనుకున్నంతగా ప్రజాదరణ లభించలేదు. అందుకు కారణం టికెట్‌ రేట్లు ఎక్కువగా ఉండటమే. ఈ క్రమంలో ప్రయాణికులు ఎక్కువగా ఎక్కని మార్గాల్లో రైల్వే శాఖ వందేభారత్‌ రైల్ టికెట్ రేట్లను తగ్గించింది.

కొన్ని మార్గాలు మినహాయించి.. చాలా వరకు వందేభారత్‌ రైళ్లను ప్రయాణికులు ఆదరిస్తున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న సికింద్రాబాద్-విశాఖ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ప్రయాణికులు బాగానే ఎక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో వందేబారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు వచ్చింది. అయితే.. విశాఖ నుంచి తిరుపతి మార్గంలో వందేభారత్‌ రైలు ప్రారంభం కాబోతున్న సమాచారం తమకు అందలేదని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్ నడుస్తోందని అంటున్నారు. మరో రైలు అందుబాటులోకి వస్తే తమకు సమాచారం అందేదని.. కానీ ఎలాంటి విషయం తెలియదని అంటున్నారు. అయితే.. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తోన్న వందేభారత్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ ఇలా జరుగుతూనే ఉంది. దాంతో.. ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రేక్‌ను చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మరో పక్క దీన్ని విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

Next Story