భారీగా పెరిగిన టమాటా ధర, కిలో @100

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. చుక్కలు చూపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  18 Jun 2024 1:58 AM GMT
tomato, rate hike, kg rs.100,

భారీగా పెరిగిన టమాటా ధర, కిలో @100 

వర్షాకాలం ప్రారంభం అయినా.. చాలా చోట్ల వానలు పడటం లేదు. పైగా ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో.. టమాటా దిగుబడులు తగ్గిపోయాయి. మార్కెట్లో సరిపడినంత టమాటా అందుబాటులో లేదు. దాంతో.. దేశ వ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. చుక్కలు చూపిస్తున్నాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో తీవ్రమైన వేడిగాలుల వీచాయి. దాంతో..గడిచిన 20 రోజుల్లో టమాటా ధరలు రెండింతలు పెరిగి కిలోకు రూ.50కి వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర రూ.80కిపైగా పలుకుతోంది. ఉత్తర భారతదేశంలో ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం సరఫరా కూడా పెద్దగా లేకపోవడంతో ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టమాటా కిలో ధర రూ.60కి పైగానే పలుకుతోంది. గత రెండు, మూడు వారాల్లో గతేడాది కంటే ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయని Agmarket డేటా చూపిస్తోంది.

బెంగళూరులోని రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమాటలు రూ.80 పలుకుతోంది. ఈ ఏడాది ఎండలు దంచికొట్టాయి. చాలా ప్రాంతాల్లో ఎక్కువ రోజుల పాటు 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యయి. దాంతో.. పంటలను ఎండలు దెబ్బకొట్టాయి. ఫలితంగానే ఉత్పత్తి తగ్గి భారీగా డిమాండ్ పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ అధికారి సచిన్ పాటిల్ చెప్పారు.

హైదరాబాద్‌లో కూడా పెరిగిన ధర

హైదరాబాద్‌లో కూడా టమాటా ధరలు మండిపోతున్నాయి. నాణ్యమైన మొదటిరకం టమాటా కిలో రూ.90 వరకు పలుకుతోంది. సెకండ్‌ క్వాలిటీ టమాటా ధర రూ.70 వరకు ఉంది. హోల్‌సేల్ మార్కెట్లలో రూ.120కి మూడు కిలోలుగా విక్రయిస్తున్నారు. దాంతో.. సామాన్యులు టమాటా కొనసాలంటేనే భయపడిపోతున్నారు. జూలైలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల్లోనే కిలో టమాటా దర రూ.100 కూడా దాటే అవకాశాలు లేకపోలేదని వ్యవసాయ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సబ్సిడీ అందించాలని కోరుతున్నారు.

Next Story