సెంచరీ దాటిన టమాట ధర.. అదే బాటలో మిర్చి
కొన్ని ప్రాంతాల్లో ఏకంగా దీని ధర 100 రూపాయలకు పైగానే పలుకుతోంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 7:49 AM GMTసెంచరీ దాటిన టమాట ధర.. అదే బాటలో మిర్చి
నిత్యావసర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో.. సామాన్యులు ఏదైనా కొనాలంటేనే ఆలోచించాల్సి వస్తుంది. ఇక కూరగాయల విషయానికి వచ్చినా అదే రిపీట్ అవుతోంది. కూరగాయల ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కొందరికి పూట గడిచేందుకు కూడా కాస్త కష్టంగానే మారింది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక అన్ని కూరల్లో వాడే టమాట ధర అయితే అమాంతం పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా దీని ధర 100 రూపాయలకు పైగానే పలుకుతోంది. దీంతో.. సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే జంకుతున్నారు. రేట్లు ఇలా ఉంటే ఎలా బతికేదంటూ ఆందోళన చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక మార్కెట్లలో కిలో టమాట ధర రూ.100 పలుకుతోంది. కొన్ని మార్కెట్లలో మాత్రమే రూ.60 నుంచి రూ.80 వరకు టమాట ధర ఉంది.
గత నెలలో ఉత్తర్‌ప్రదేశ్ సహా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కిలో టమాట రూ.2 నుంచి రూ.5 మధ్యే పలికింది. అప్పుడు రైతులు గిట్టుబాటు ధర లేక ఆవేదన చెందారు. ఇప్పుడు కిలో టమాట ధర నెల వ్యవధిలోనే అత్యధిక రెట్లు పెరిగిపోయింది. ఢిల్లీ మార్కెట్లో కిలో టమాట ధర రూ.70 నుంచి రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లోనూ రూ.60, రూ.80, రూ.100 పలుకుతోంది.
టమాట ధరలు ఇలా ఉంటే.. పచ్చిమిర్చి ధరలు కూడా సామాన్యులకు భారంగానే మారాయి. టమాట ధర వంద రూపాయలు నడుస్తుంటే.. పచ్చిమిర్చి కూడా రూ.100కు దగ్గరగా వస్తోంది. అంత ధరపెట్టి టమాట, పచ్చి మిర్చి కొనుగోలు చేయలేకపోతున్నారు సామాన్యులు.
టమాట,పచ్చిమిర్చి పంట దిగుబడి తగ్గిందని.. రోజూవారీగా మార్కెట్‌కు రావాల్సిన దానికంటే తక్కువ టమాట, పచ్చిమిర్చి మార్కెట్‌కు వస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధరలు మళ్లీ తగ్గాలంటే ప్రస్తుతం వేసిన పంటలు మళ్లీ చేతికి రావాలని.. అప్పటి వరకు ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.