నేపాల్ అడవిలో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు.. 10 గంటల తర్వాత..
ముగ్గురు భారతీయ పర్యాటకులు, వారి నేపాలీ గైడ్‌లు నేపాల్‌లోని నాగర్‌కోట్ అటవీప్రాంతంలోకి వెళ్లారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 9:18 AM ISTనేపాల్ అడవిలో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు.. 10 గంటల తర్వాత..
పర్యాటకులు చాలా మంది అడవుల్లో ట్రెక్కింగ్‌ను ఇష్టపడుతుంటారు. అయితే.. కొన్నిసార్లు రూట్‌మ్యాప్ సరిగ్గా తెలియకపోవడం వల్లో.. దారి తెలియకనో తప్పిపోతుంటారు. నివాసాల మధ్య ఉన్నప్పుడు ఓకే కానీ.. ఇలా అడవుల్లో తప్పిపోతే ప్రమాదమనే చెప్పాలి. తాజాగా నేపాల్‌లో ముగ్గురు భారతీయులు ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు భారతీయ పర్యాటకులు, వారి నేపాలీ గైడ్‌లు నేపాల్‌లోని నాగర్‌కోట్ అటవీప్రాంతంలోకి వెళ్లారు. శనివారం అడవిలోకి వెళ్లిన తర్వాత కాసేపటికే వారు దారితప్పారు. దాంతో.. ఎటువెళ్లాలో పాలుపోలేదు. అడవిలో తప్పిపోయిన పర్యాటకులు భారత్‌కు చెందిన నితిన్ తివారీ, రష్మీ తివారీ, తనీష్ తివారీ కాగా.. వారి నేపాలీ గైడ్ హరి ప్రసాద్ ఖరేల్ ఖాట్మండుకు తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తపూర్ జిల్లాలోని నాగర్‌కోట్ అటవీ ప్రాంతంలోని ముహన్ పోఖారీ రాణి జులా ప్రాంతం నుండి అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారతీయ పౌరులు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారే కావడం గమనార్హం. పర్యాకుటులు, గైడ్ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దారి తప్పారని చెప్పారు. ఇక రెస్క్యూటీమ్ అర్ధరాత్రి అక్కడికిచేరుకున్నారని చెప్పారు అధికారులు. రాణి ఝూలా ప్రాంతానికి వెళ్లే మార్గాన్ని గుర్తించలేక పొరపాటున సమీపంలోని అటవీ ప్రాంతం వైపు వెళ్లడంతో వారు అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు.
తప్పిపోయిన వారిని హల్హలే ఖౌపా ప్రాంతంలో కనుగొన్నట్లు అధికారులు చెప్పారు. అంతేకాదు.. జలగ కాటుతో బాధపడుతున్నారని చంగునారయన్ మేయర్ జీవన్ ఖత్రి తెలిపారు. వారి అదృశ్యం గురించి వార్త వ్యాపించిన వెంటనే సాయుధ పోలీసు దళం, ప్రజాప్రతినిధులు, నివాసితులు సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. దాదాపు 10 గంటల తర్వాత ఆదివారం సురక్షితంగా రక్షించబడ్డారు. రక్షించబడిన వ్యక్తులు సురక్షితంగా ఖాట్మండుకు తిరిగి వచ్చారు.