కెన్యాలో ఉద్రిక్తతలు.. బయటకు రావొద్దని భారతీయులకు కేంద్రం సూచనలు
కెన్యాలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. దేశంలో పన్నుల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు
By Srikanth Gundamalla
కెన్యాలో ఉద్రిక్తతలు.. బయటకు రావొద్దని భారతీయులకు కేంద్రం సూచనలు
కెన్యాలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. దేశంలో పన్నుల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. దాంతో.. పలు చోట్ల ఈ ఆందోళనల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. హింసాత్మకంగా మారాయి. దాంతో.. కెన్యాలోని భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. కెన్యాలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అనవసరంగా బయటకు రావొద్దనీ హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
కెన్యాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనీ.. భారతీయులు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అనసవరం అయితే బయటకు రావొద్దని చెప్పింది. పరిస్థితులు చక్కబడే వరకు నిరసనలు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని కెన్యాలోని భారత కాన్సులేట్ ఎక్స్ వేదికగా తెలిపింది. కెన్యాలో నివసిస్తున్న భారత పౌరులు స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించింది. ఇక అప్‌డేట్స్ కోసం భారత కాన్సులేట్ మిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో కావాలని తెలిపింది.
కాగా.. కెన్యాలో పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారం కెన్యా పార్లమెంట్‌ను ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. దాంతో.. పరిస్థితులు మరింత అదుపుతప్పాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనల్లో ఏకంగా ఐదుగురు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలైనట్లు తెలిసింది. అయినప్పటికీ పార్లమెంట్‌లోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు కొన్ని విభాగాలను ధ్వంసం చేశారు. తీవ్ర ఆందోళనల మధ్యే పన్ను పెంపు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక కెన్యాలో మున్ముందు మరెలాంటి హింసాత్మక సంఘటనలు జరుగుతాయో అని ఆందోళన నెలకొంది.