ఆ రోజు తిరుమల, యాదాద్రి ఆలయాల మూసివేత.. ఎందుకంటే..

తిరుమల, యాదాద్రి ఆలయానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.

By Srikanth Gundamalla  Published on  26 Oct 2023 9:03 AM GMT
temples closed, on oct 28th,  lunar eclipse,

ఆ రోజు తిరుమల, యాదాద్రి ఆలయాల మూసివేత.. ఎందుకంటే..

తిరుమల, యాదాద్రి ఆలయానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ఈ నెల 28న తేదీన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాలు మూతపడతనున్నాయి. అయితే.. అక్టోబర్ 28వ తేదీన చంద్ర గ్రహణం ఉంది. ఆ కారణంగానే యాదాద్రి, తిరుమల ఆలయాలను మూసివేయనున్నారు అర్చకులు. ఈ నెల 28న సాయంత్రం 4 గంటల నుంచి ఆ తర్వాత రోజు అంటే ఈ నెల 29వ తేదీ ఉదయం 5 గంటల వరకు యాదాద్రి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. చంద్రగ్రహణానికి ముందు రోజు అక్టోబర్ 27న రాత్రి 7 గంటలకు శరత్‌ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్స కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు యాదాద్రి ఈవో తెలిపారు.

చంద్రగ్రహణం సందర్భంగా అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేసి.. ఆ తర్వాత తిరిగి 29వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు తెరుస్తామని ఈవో చెప్పారు. ఆ తర్వాత అర్చకులు ఆలయ సంప్రోక్షణ నిర్వహిస్తారని చెప్పారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలు శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను కూడా మూసివయనన్నట్లు చెప్పారు. కాగా.. చంద్రగ్రహనం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఈ నెల 28న రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేసి.. మరుసటి రోజు ఆలయాన్ని తెరవనున్నారు. ఆ తర్వాత సంప్రోక్షణ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా దర్శనాలు ఉండవని భక్తులు గమనించాలని అధికారులు కోరారు.

అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవించనుంది. ఈ నెల 28న అర్ధరాత్రి 1:06 గంటలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. రాత్రి 2:22 గంటల వరకు గ్రహణం కొనసాగనుంది. మొత్తం గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుందని.. దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. ఇక చంద్రగ్రహణం కారణంగా విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం ఆలయాలు కూడా మూతపడనున్నాయి.

Next Story