విషాదం, ఆస్ట్రేలియాలో తెలుగు యువ వైద్యురాలు మృతి

ఓ తెలుగు అమ్మాయి కూడా విదేశాల్లో ఎంబీబీఎస్ చదివింది. చివరకు ఊహించని ప్రమాదంలో పడి తన జీవితాన్ని ముగించింది.

By Srikanth Gundamalla  Published on  9 March 2024 1:30 AM GMT
telugu woman, young doctor, died,  australia ,

విషాదం, ఆస్ట్రేలియాలో తెలుగు యువ వైద్యురాలు మృతి

విదేశాల్లో మంచి చదువులు చదువుకోవాలని యువత కలలు కంటారు. అందుకోసం చాలా మంది చిన్ననాటి నుంచి కష్టపడి చదవి.. విదేశాల్లో తాము కోరుకున్న యూనివర్సిటీల్లో సీటు సంపాదిస్తారు. ఆ తర్వాత అక్కడకు వెళ్లి చదువు పూర్తి చేసి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఇంకొందరు ఫారెన్‌లో స్టడీస్ పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే.. ఓ తెలుగు అమ్మాయి కూడా విదేశాల్లో ఎంబీబీఎస్ చదివింది. మంచి వైద్యురాలు కావాలని అనుకున్నది. ఆమె చివరకు ఊహించని ప్రమాదంలో పడి తన జీవితాన్ని ముగించింది.

ఆస్ట్రేలియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె రాయల్‌బ్రిస్బేన్‌ ఉమెన్స్‌ ఆస్పత్రిలో పని చేస్తోంది. మార్చి 2వ తేదీన సరదాగా బయటకు వెళ్లింది. తోటి స్నేహితులతో కలిసి ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంది. ఈ క్రమంలోనే వారితో కలిసి ట్రెక్కింగ్‌ చేసింది. అయితే.. ట్రెక్కింగ్‌ చేస్తున్న సమయంలో ఉజ్వల ప్రమాదవశాత్తు జారి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఎంబీబీఎస్‌ తర్వాత పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని అనుకుంది. కానీ.. విధి ఆమెను చిన్నచూపు చేసి మధ్యలోనే తీసుకెళ్లిపోయింది.

అనుకోని సంఘటనలో తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేవ్వరరావు కూడా కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. ఇక ఉజ్వల అంత్యక్రియలను మార్చి 9న ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్య ఇంటికి తీసుకెళ్తున్నట్లు బంధువులు చెప్పారు.

Next Story