ఎన్నికల నామినేషన్లకు ఇదే నియావళి.. అభ్యర్థులకు ఈసీ సూచనలు
నామినేషన్ల దాఖలుపై ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 4:32 PM GMTఎన్నికల నామినేషన్లకు ఇదే నియావళి.. అభ్యర్థులకు ఈసీ సూచనలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. టికెట్ దక్కించుకున్న వారు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ఎన్నికల ప్రక్రియలో తొలి అంకం ప్రారంభం కానుంది. నవంబర్ 3న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ విడుదల అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనుంది.
ఈ క్రమంలో నామినేషన్ల దాఖలుపై ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. త అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన కొందరిపై వారి ప్రత్యర్థులు నియమావళిని పాటించలేదని ఆరోపిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నామినేషన్ల ప్రక్రియ సజావుగా, సక్రమంగా సాగాలని అభ్యర్థులు సరైన పత్రాలు సమర్పించేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఎన్నికల నామినేషన్ల నియమాలు:
నామినేషన్ సమయాలు.. నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు చేసేందుకు అవకాశం
- నామినేషన్ వేసే అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీకి చెందిన వారైతే సదరు అభ్యర్థిని అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపు పొందని పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే అదే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి.
- ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కు ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
- ఒకో అభ్యర్థి ఒకో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు.
- ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఆయా వర్గాలకు చెందిన వారై ఉండాలి. ఈ మేరకు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
- ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 4, 5 ప్రకారం జనరల్ క్యాటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయొచ్చు.
- అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
- నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వంటి అన్ని వివరాలూ ఉండాలి.
- నామినేషన్ దాఖలు చేసే సమయంలో RO కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో అభ్యర్థుల కాన్వాయ్‌లో 3 వాహనాలకు అనుమతి
- RO గదిలోకి అభ్యర్థితో సహా 5 మంది వ్యక్తులకు మాత్రమే అనుమతి
- నామినేషన్‌తో పాటు అభ్యర్థి తన నేర పూర్వ చరిత్రలు, ఆస్తులు, అప్పులతో పాటు విద్యార్హతల గురించి సమాచారాన్ని తెలుపుతూ ఫారం-26లో అఫిడవిట్‌ను దాఖలు చేయాలి.
- నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒక రోజు ముందు, ప్రతి అభ్యర్థి తన ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బ్యాంక్ A/cని తెరవాలి. బ్యాంక్ A/c రాష్ట్రంలో ఎక్కడైనా తెరవవచ్చు.
- ఆన్‌లైన్ నామినేషన్ సౌకర్యం ECI యొక్క సువిధ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంది. దాని యొక్క సంతకం హార్డ్ కాపీని RO కి సమర్పించాలి.
- ప్రతి రోజు మధ్యాహ్నం 3.00 గంటల తర్వాత, RO దాఖలు చేసిన నామినేషన్ల జాబితాను ప్రకటిస్తుంది.
- నామినేషన్లు, అఫిడవిట్ల కాపీలు అదే రోజున RO కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించబడతాయి.
- అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్‌లను 24 గంటలలోపు ECI వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. CEO వెబ్‌సైట్‌లో కూడా ప్రదర్శించబడుతుంది.