వివేకా హత్యకేసులో ప్రజాకోర్టు తీర్పు కావాలి: సునీతారెడ్డి

వైఎస్‌ వివకానందరెడ్డి హత్య కేసు విషయంపై ఆయన కుమార్తె సునీతారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

By Srikanth Gundamalla  Published on  1 March 2024 1:30 PM IST
sunitha reddy,    ys viveka, murder case,

వివేకా హత్యకేసులో ప్రజాకోర్టు తీర్పు కావాలి: సునీతారెడ్డి

వైఎస్‌ వివకానందరెడ్డి హత్య కేసు విషయంపై ఆయన కుమార్తె సునీతారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఏమాత్రం ముందుకు సాగడం లేదని ఆమె అన్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అయితే.. తన తండ్రి హత్య కేసులో ప్రజాకోర్టులో తీర్పు కావాలని కోరకుంటున్నట్లు సునీతారెడ్డి చెప్పారు.

కొద్దిరోజుల్లోనే ఎవరి హత్య కేసుల్లో అయినా నిందితులు తేలిపోతారనీ.. కానీ వివేకానందరెడ్డి హత్య కేసులో మాత్రం ఏళ్లు గడుస్తున్నా దోషులు ఎవరో తేల్చడం లేదని సునీతారెడ్డి అన్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. సొంతవాళ్లే వివకానందరెడ్డిని మోసం చేశారనీ.. దాంతో ఆయన ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. అయినా కూడా తన తండ్రి నిరాశ చెందకుండా మరింత యాక్టివ్‌గా పనిచేశారని సునీతారెడ్డి పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత 2019 మార్చి 15న మార్చురీ బయట అవినాశ్‌ తనని కలిశారని సునీతారెడ్డి చెప్పారు. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని తనతో చెప్పినట్లు వెల్లడించారు. ఎందుకలా చెప్పారో అర్థం కాలేదన్నారు. సినిమాల్లో చూపించిన విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు కానీ మనం రియలైజం కాలేమని వ్యాఖ్యానించారు. అసలు వివేకాను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసంటూ ప్రశ్నించారు. ఇది బయటకు రావాలని సునీతారెడ్డి డిమాండ్ చేశారు.

తన తండ్రి హత్య కేసులో భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ప్రమేయం ఉందని సునీత అన్నారు. వాళ్లను సీఎం జగన్ రక్షిస్తున్నారని ఆరోపించారు. అవినాశ్‌కు శిక్ష పడాలని కోరకుంటున్నట్లు చెప్పారు. ఇచ్చిన మాటమీద నిలబడతాననే సీఎం జగన్.. చెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత వాళ్లను సులువుగా అనుమానించలేమన్నారు. ఒక్కో వాస్తవం బయటకు వస్తుంటే ఇప్పుడు నమ్మాల్సి వస్తోందన్నారు. ఈ హత్య కేసులో 8 పేర్లు బయటకు వచ్చాయనీ.. ఇంకా రాని పేర్లు చాలా ఉన్నాయన్నారు. అందరినీ విచారించాలనీ నిజమైన దోషులకు శిక్షపడాలని ఈ సందర్భంగా సునీతారెడ్డి అన్నారు.

Next Story