శ్రీలంక ప్రధాని రాజీనామా

By -  Nellutla Kavitha |  Published on  9 May 2022 4:30 PM IST
శ్రీలంక ప్రధాని రాజీనామా

విపక్షాల ఆందోళనలు, దేశ ప్రజల నిరసనలతో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేశారు. గత నెల రోజులుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ పెరిగిపోతుండడంతో దేశ ప్రజలు ఆందోళన తీవ్రతరం చేశారు. ఈ నేపధ్యంలోనే రెండుసార్లు ఎమర్జెన్సీని విధించారు. అయినప్పటికీ ఆందోళనలు, నిరసనలు దేశవ్యాప్తంగా ఉధృతమయ్యాయి.

దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే, ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేయాలని విపక్షాలు వారం రోజులు డెడ్ లైన్ పెట్టాయి. దీంతో పాటే నిరసనలను మాత్రం ఆపలేదు ప్రజలు. అయితే నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో స్థానికంగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు మరోసారి కర్ఫ్యూను కూడా విధించారు. ఆగ్రహంతో ఉన్న శ్రీలంక ప్రజలు మాత్రం తమ నిరసనను ఆపలేదు. అయితే రాజీనామా కు ముందు ప్రధాని మహీంద రాజపక్సే ఆర్థిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, హింస మరింత హింసను ప్రేరేపిస్తుంది అంటూ ట్వీట్ చేశారు.

శ్రీలంకలో దాదాపుగా నెల రోజుల నుంచి అక్కడి ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. ఆహార కొరత తీవ్రతరమైంది, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తీవ్రం అయింది. దీనికితోడు అధికార పక్షంపై విపక్షాల ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోయింది. ఒకవైపు ప్రజల ఆందోళన, మరోవైపు విపక్షాల నిరసనల తో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సే ఈరోజు రాజీనామా చేశారు.

Next Story