ఎడారిలో దారితప్పి కరీంనగర్ వాసి దయనీయస్థితిలో మృతి
రబ్ అలీ ఖలీ ఎడారిలో తెలంగాణ కు చెందిన ఒక వ్యక్తి దయనీయ పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 8:45 AM ISTఎడారిలో దారితప్పి కరీంనగర్ వాసి దయనీయస్థితిలో మృతి
సౌదీ అరేబియాలో ఎడారుల గురించి అందరికీ తెలిసిందే. అక్కడ అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా పేరున్న రబ్ అలీ ఖలీ ఎడారిలో తెలంగాణ కు చెందిన ఒక వ్యక్తి దయనీయ పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎడారిలో చిక్కుకుపోయిన కరీంనగర్ వాసి చనిపోయాడు. నాలుగు రోజుల తర్వాత అతని మృతదేహాన్ని గుర్తించారు అధికారులు.
కరీంనగర్‌కు చెందిన 27 ఏళ్ల మహమ్మద్ షేజాద్‌ఖాన్ సౌదీ అరేబియాలోని ఒక టెలీకమ్యూనికేషన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా అక్కడే పనిచేసుకుంటూ నివసిస్తున్నాడు. అయితే.. సూడాన్‌కు చెందిన సహచర ఉద్యోగితో కలిసి షేజాద్‌ఖాన్ ట్రిప్‌కు ప్లాన్ చేశాడు. కారులో కలిసి వెళ్లారు. ఈ అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా పేరున్న రబ్ అల్ ఖలీ ఎడారికే వీరు వెళ్లారు. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత జీపీఎస్ సిగ్నల్‌ను కోల్పోయారు. దాంతో.. ఎటు వెళ్లాలో ఇద్దరికీ దారి తెలియలేదు. ఎడారిలో చిక్కుకుపోయారు.
దాదాపు 650 కిలోమీటర్ల విస్తీర్ణయం ఈ ఎడారి వ్యాపించి ఉంది. ఎటు నుంచి ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దానికి తోడు ఫోన్‌లో చార్జ్ కూడా అయిపోయి.. ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దాంతో.. ఎవరికైనా కాల్ చేసి సాయం కోరే పరిస్థితి కూడా లేకుండా పోయింది.ఆ తర్వాత పెట్రోల్ కూడా అయిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఎటువెళ్లలేని స్థితిలో ఎడారిలోనే ఉండిపోయారు. తిండీ తిప్పలు లేక.. కనీసం నీళ్లు లేక అల్లాడిపోయారు. చివరి ఎండారిలో ఎండ వేడికి డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దయనీయస్థితిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే.. నాలుగు రోజుల తర్వాత వీరి మృతదేహాలను స్థానిక అధికారులు గుర్తించారు. వీరు తీసుకెళ్లిన కారు పక్కనే మృతదేహాలు పడి ఉన్నట్లు చెప్పారు.