యుద్ధానికి 30 రోజులు
By - Nellutla Kavitha | Published on 25 March 2022 3:08 PM GMTఅప్పుడే నెల రోజులు గడిచిపోయాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై నాలుగు వారాలు గడిచింది. ఇంకా ఎంత కాలం యుద్ధం కొనసాగుతుంది? అసలు పుతిన్ ఎందుకు యుద్ధం ప్రారంభించాడు? ఏం సాధించాలనుకున్నాడు? ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? పుతిన్ భవిష్యత్ వ్యూహాలు ఏంటి? అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు ఇవే. గత నెల 24న దండయాత్ర ప్రారంభించాడు పుతిన్. బెలారస్ సరిహద్దు నుంచి ఉక్రెయిన్ సోకి సైన్యం చొరబడడం ద్వారా యుద్ధం మొదలైంది. కీవ్ ను రెండు, మూడు రోజుల్లోనే స్వాధీనం చేసుకుంటారు అని అనుకున్నప్పటికీ, నెలరోజులైనా ఫలితం ఇంకా తేలలేదు.
నాలుగు వారాల తర్వాత అందమైన ఉక్రెయిన్ శిధిలమై పోయింది. ఎక్కడ చూసినా స్మశాన వాతావరణమే కనిపిస్తోంది. సుందర కట్టడాలన్నీ కనుమరుగైపోయాయి. లక్షలాది మంది శరణార్ధులయ్యారు. వేలాది మంది మృత్యువాత పడ్డారు. వికలాంగుల లెక్కేలేదు. నిత్యం బాంబుల మోత, ప్రతిరోజు భయం భయం. ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. అయినా తగ్గేది లేదంటోంది రష్యా, తలవంచే ది లేదంటోంది ఉక్రెయిన్. నాటో నుంచి బలం - బలగం, సహాయం - సహకారం ఉక్రెయిన్ కు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. రష్యా రోజురోజుకీ వ్యూహాల్ని మారుస్తోంది. నెలరోజులైనా రష్యా కీవ్ లోకి వెళ్లలేకపోయింది. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది. ఒకవైపు హైపర్ సోనిక్ క్షిపణులని ప్రయోగిస్తునే, మరోవైపు అణు కేంద్రాలను స్వాధీనం చేసుకుంది రష్యా. యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ నెలరోజుల్లో ఉక్రెయిన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా రష్యాతో పాటుగా వివిధ దేశాలకు తీవ్రమైన నష్టం కలిగింది.
ఎవరు యుద్ధం చేసినా నష్టపోయేది మాత్రం సామాన్యులే. ఇక్కడ కూడా తిండి, నీరు లాంటి కనీస అవసరాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు సామాన్య ప్రజలు. అరకొరగా నిత్యవసర వస్తువులు దొరుకుతున్నాయి, కరెంటు కష్టాలు ఉండనే ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రాణ, ఆస్తి నష్టం ఎంత జరిగిందో తెలియదు. దేనిమీద అధికారిక లెక్కలు లేవు, కేవలం అంచనాలు మాత్రమే. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదని రష్యా చెప్తుంటే, రష్యా పై నాటో దేశాల ఆంక్షలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ - రష్యా మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం మాత్రం తేలలేదు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, వ్యతిరేకతలు, సోషల్ మీడియాలోను కనిపిస్తున్నాయి. బ్రెడ్ బాస్కెట్ గా పేరున్న ఉక్రెయిన్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద కూడా కనిపిస్తోంది. వంట నూనెలు, గోధుమలు, మొక్కజొన్న, ఇతర ఆహార ఉత్పత్తులపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. వాణిజ్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. కరోనాతో కుదేలైన ఆర్థిక రంగంపై ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం గుదిబండగా మారింది. ఇంధన ధరలు పెరగడంతో పాటుగా ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం కనిపిస్తోంది. యుద్ధం, ప్రతిఘటన, రక్తపాతం కొనసాగుతూనే ఉంది. అయితే ఇంకా ఎంతకాలం?జవాబు ఎవరి దగ్గర ఉంది? ఫుల్స్టాప్ ఎప్పుడు పడుతుంది? అంతుచిక్కని, జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలాయి. సామాన్య ప్రజలకు కన్నీటిని, కడుపుకోతను మిగులుస్తూ.