వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2024 7:45 PM IST
ఏపీలో వైఎస్సార్‌సీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను సోమవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు అందించారు. తాజాగా కృష్ణయ్య రాజీనామాను ఆమోదించినట్లు రాజ్యసభ చైర్మన్ మంగళవారం వెల్లడించారు. అయితే.. ఆర్. కృష్ణయ్య పదవీకాలం మరో నాలుగేళ్లు ఉంది. అయినా కూడా ఆయన రాజీనామా చేయడం వైసీపీకి బిగ్ షాకే అంటున్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయనీ.. అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆర్. కృష్ణయ్య చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు ఉన్నాయి. ఇందులో 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. దాంతో.. 11 మొత్తం స్థానాలను ఆ పార్టీనే కైవసం చేసుకుంది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ త్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఆ తరువాత ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్.కృష్ణయ్య రాజీనామా చేయడంతో.. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం ఎనిమిది సభ్యులకు పడిపోయింది.