వనమాకు ఊరట.. ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టు స్టే
వనమా వెంకటేశ్వరావు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2023 6:34 PM ISTవనమాకు ఊరట.. ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టు స్టే
కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఆయన తర్వాత రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావుని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే.. హైకోర్టు తీర్పుపై వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా అర్హత లేదని హైకోర్టు తీర్పు విధించిందని.. తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టుని కోరారు వనామా. వనమా పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం.. ఎమ్మెల్యే అనర్హతపై స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. దాంతో.. వనమా వెంకటేశ్వరరావుకి సుప్రీంకోర్టులో ఊరట దక్కినట్లు అయ్యింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్‌గా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై 4వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. అయితే.. ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తన ఆస్తులు, కేసుల వివరాలను పొందుపర్చలేదని జలగం వెంకట్రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆస్తులపై తప్పుడు వివరాలు ఇచ్చారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో.. సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత గత నెల 25న వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. అలాగే ఆయన తర్వాతి స్థానంలో ఉన్న జలగం వెంకట్రావుని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. తీర్పు కాపీని కూడా అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి జలగం వెంకట్రావు అందజేశారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ ముందు వనమా వెంకటేశ్వరావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎమ్మెల్యే అనర్హత తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాత జరగనుంది.