శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే

By -  Nellutla Kavitha |  Published on  12 May 2022 10:10 PM IST
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే

శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, దానికి తోడు గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గమంటున్నాయి. ఇటీవలే మహింద రాజపక్స ప్రధానిగా రాజీనామా చేసిన పరిస్థితుల్లో శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా సీనియర్ లీడర్ రణిల్ విక్రమసింఘే నియమితులయ్యారు. గతంలో అయిదు సార్లు ప్రధానిగా వ్యవహరించిన 73 ఏళ్ల రణిల్ విక్రమ సింఘే ఆరోసారి ఈరోజు సాయంత్రం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

తీవ్రమైన ప్రజాగ్రహం, ప్రతిపక్షాల ఒత్తిడితో ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలగాల్సిన పరిస్థితులు లంకలో ఏర్పడ్డాయి. దాంతో ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకోవడంతో విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రణిల్ కష్టకాలంలో దేశాన్ని సవ్యమైన దిశలో నడిపిస్తారని ఆశిస్తున్నారంతా.

శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 సీట్లు ఉండగా కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే పార్టీ యూఎన్‌పీకి కేవలం ఒక్క సీటు మాత్రమే ఉంది. ప్రస్తుత ప్రధాని మాత్రమే ఎంపీగా కొనసాగుతున్నారు. రణిల్ విక్రమ సింఘే ఆరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆయన సొంత పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీలో హర్షం వ్యక్తమైంది. రణిల్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక పార్లమెంటులో మెజారిటీ సభ్యుల మద్ధతు సాధిస్తారని యునైటెడ్ నేషనల్ పార్టీ చైర్మన్ వజిర అబేవర్ధనే ఆశాభావం వ్యక్తంచేశారు. దాంతోపాటే రణిల్ గతంలో ప్రధానిగా చేసిన అనుభవం, ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం సమస్యల్ని చక్కదిద్దటంలో ఉపయోగపడుతుందని, ఆర్ధిక స్థితి గాడిన పడుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Next Story