రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఇదే..

శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు.

By Srikanth Gundamalla  Published on  19 Aug 2024 2:00 AM GMT
rakshabandhan, festival,   best time to tie Rakhi,

రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఇదే.. 

శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రక్షగా, వారు ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంది. రాఖీ పౌర్ణమి రోజు వచ్చే భధ్రకాలాన్ని ఆ రోజు పరిగణలోకి తీసుకుంటారు. భద్రుని నీడ ఉన్న సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు. ఇవాళ తెల్లవారుజామున 3.04 గంటల నుండి రాత్రి 11.55 వరకు పౌర్ణమి ఉంటుంది. అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. ఉదయం 9.51 కి భద్రకాలం ప్రారంభమవుతుంది. ఆ తరువాత మధ్యాహ్నం 1.30 కి ఈ భద్రకాలం ముగుస్తుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. భద్ర లంకాధిపతి రావణాసురుడికి సోదరి అని పురాణ కథనాలు చెబుతున్నాయి. రావణాసురుడి చెల్లెలు భద్ర పౌర్ణమి అనుకుని ఇంకా పౌర్ణమి తిథి రాకముందే రావణాసురుడికి రక్ష కట్టిందట. ఈ కారణంగానే రావణాసురుడికి రాముడి చేతిలో మరణం సంభవించింది అని పురాణ కథనాల సారాంశం. అందుకే అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు.

రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రం చెప్పండి..

హిందూ మతంలో వేద మంత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మంత్రోచ్ఛరణ లేకుండా ఏ పవిత్ర కార్యం సంపూర్ణమవదు. రక్షాబంధన్ రోజున కూడా అక్కాచెల్లెల్లు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కడుతూ మంత్రం చదవాలని పండితులు చెబుతున్నారు. రక్షాబంధన్ రోజున సోదరులకు కుంకుమ తిలకం పెట్టి.. రాఖీ కట్టేటప్పుడు అతని ముఖం తూర్పు వైపు.. సోదరి ముఖం పడమర వైపు ఉండాలి. ఇలా చేస్తే ఇద్దరి జీవితాలు శుభప్రదంగా ఉంటాయి. అన్ని రంగాల్లో పురోగతిని, విజయాన్ని సాధిస్తారు. రాఖీ కడుతూ.. ‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల’’ మంత్రాన్ని చదవాలని పండితులు చెబుతున్నారు. ‘అత్యంత దయగల రాజు బాలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను. అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది.’ అని ఈ మంత్రం అర్థమని వివరిస్తున్నారు. ఇక జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత.. దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టాలనీ.. లేదంటే నీటిలో వేయాలని చెబుతున్నారు.

Next Story