రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కౌంటర్ల వద్ద డిజిటల్ చెల్లింపులు
రైల్వేలో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 12:23 PM GMTరైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కౌంటర్ల వద్ద డిజిటల్ చెల్లింపులు
రైల్వేలో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ ప్రయాణం సురక్షితం మాత్రమే కాదు.. చాలా తక్కువ ధరతో కూడుకున్నది. దాంతో.. చాలా మంది రైల్వే ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే.. రైల్వే ప్రయాణికులకు తాజాగా దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేస్తున్నట్లు చెప్పింది. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అవకాశ కల్పించనున్నట్లు పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు చిల్లర కష్టాలు తప్పనున్నాయి. తొలుతగా ప్రధాన రైల్వే స్టేషన్లలో మాత్రమే ఈ సదుపాయం ఉంది. కానీ.. ఇప్పుడు అన్ని స్టేషన్లకు విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వివరించింది.
రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దాని ద్వారా డిజిటల్ చెల్లింపులు ఈజీగా చేసి టికెట్‌ను పొందవచ్చని పేర్కొంది.ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నట్లు తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్‌లో ఎంటర్ చేశాక.. ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని యూపీఐ యాప్స్ వినియోగించి చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఇక.. పేమెంట్ పూర్తవ్వగానే టికెట్‌ను అందిస్తారు అధికారులు. దశలవారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులంతా సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో కోరింది.