ఖతార్ కోర్టు: 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష

ఖతార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత్‌కు చెందిన 8 మంది నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష విధించింది.

By Srikanth Gundamalla  Published on  26 Oct 2023 1:45 PM GMT
Qatar court, sentences, 8 ex-Indian Navy officers,  death,

ఖతార్ కోర్టు: 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష

ఖతార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత్‌కు చెందిన 8 మంది నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష విధించింది. భారత్‌కు చెందిన ఎనిమిది మంది నేవీ మాజీ అధికారులు కొన్ని నెలల నుంచి ఖతార్‌ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తీర్పు వెలవరించిన కోర్టు వారికి మరణ దండన విధిస్తూ గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఖతార్‌ కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. భారత నేవీ మాజీ అధికారులను దోషులుగా తేల్చి మరణశిక్ష విధించడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై చట్టపరంగా ఉన్న అన్ని చర్యలను తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. బాధితుల కుటుంబ సభ్యులతోపాటు న్యాయ బృందంతో మాట్లాడుతున్నట్లు వివరించింది

అయితే ఈ 8 మంది భారత మాజీ నేవీ అధికారులు ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే వారందరికీ ఖతార్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు గురించి ఖతార్‌ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. బాధితుల కుటుంబ సభ్యులతో పాటు న్యాయ బృందంతో టచ్‌లో ఉన్నట్లు తెలిపాయి. చట్టపరంగా అన్ని అవకాశాల కోసం అన్వేషిస్తున్నామని.. కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ వర్గాలు చెప్పాయి. ఇక గోప్యతకు సంబంధించిన కారణాల కారణంగా ఈ కేసుపై ఎక్కువగా వ్యాఖ్యానించలేమని తెలిపింది.

కాగా.. భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్‌లకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించింది. వీరిని 2022 ఆగస్ట్‌ 30న ఖతార్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఏడాదికి పైగా ఎనిమిది మంది ఖతార్‌లోని జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. ఖతార్‌ సాయుధ దళాలకు శిక్షణ, సేవలు అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం.. ఆ దేశంలో పనిచేసిన ఈ 8 మంది ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా వ్యవహరించినట్లు ఖతార్‌ అధికారులు ఆరోపణలు చేశారు.

వీరిని బయటకు తీసుకొచ్చేందుకు ఖతార్ ప్రభుత్వంతో భారత విదేశాంగ అధికారులు అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అంతేకాదు.. పలుమార్లు బెయిల్‌కు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వీరి నిర్బంధాన్ని ఖతర్‌ ప్రభుత్వం పొడిగించింది. చివరకు ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఎనిమిది మందికి తాజాగా అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Next Story