దేశంలోనే తొలిసారి - హైదరాబాద్ లో ప్రైడ్ ప్లేస్

By -  Nellutla Kavitha |  Published on  13 April 2022 6:46 AM GMT
దేశంలోనే తొలిసారి - హైదరాబాద్ లో ప్రైడ్ ప్లేస్

స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరం కాదు అంటూ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2018 లోనే తీర్పు చెప్పింది. లెస్బియనస్, గేస్, బైసెక్సువల్, లింగ మార్పిడి చేయించుకున్న వారికి కూడా హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 6, 2018 న తన జడ్జిమెంట్ ఇచ్చింది. అయినప్పటికీ, ఇప్పటికీ కూడా తమ హక్కులకోసం పోరాటాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు ఎల్జీబీటీ కమ్యూనిటీ సభ్యులు. తమకు ఉన్న సమస్యల్ని, ఫిర్యాదుల్ని చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలంటూ గళమెత్తి అడుగుతూనే ఉన్నారు. ఆ దిశగా తొలి అడుగు వేసింది తెలంగాణ పోలీస్ శాఖ.

సైబరాబాద్లో గతంలోనే ట్రాన్స్ జెండర్ ల కోసం హెల్ప్ డెస్క్ ని ఓపెన్ చేసినప్పటికీ, ఇప్పుడు ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం దేశంలోనే తొలిసారిగా, మహిళా భద్రతా విభాగం, భరోసా టీంతో కలిసి హైదరాబాద్ లో ప్రైడ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. సమాజం నుంచి ఎదుర్కొంటున్న వివక్ష, వారి మీద జరుగుతున్న దాడులు, ఇతర సమస్యల గురించి మహిళా భద్రతా విభాగం, భరోసాతో పాటుగా, తరుణి, భూమిక లాంటి ఇతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రైడ్ ప్లేసులు పనిచేస్తాయి. ట్రాన్స్జెండర్, ఎల్ జి బి టి క్యూ ఐఏ వ్యక్తుల హక్కుల పై అవగాహన, వారికి చట్టపరంగా ఉన్నటువంటి భద్రత, రక్షణలు అందజేయడమే ఈ pride place ల ఉద్దేశ్యం. వారి పై జరిగే దాడులు లను అరికట్టడంతో పాటుగా, వారికి సమాజం నుంచి కావాల్సిన సంరక్షణను అందించడం కోసమే ఈ ప్రైడ్ ప్లేస్ ఏర్పాటయింది. దీంతో పాటు గానే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయి పోలీసులకు ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడమే కాకుండా, ట్రాన్స్ జెండర్ హక్కులపై అవగాహన కూడా కల్పిస్తామని మహేందర్రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సెల్ లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్ తో పాటుగా ఇతర స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తాయి. వీరికి తోడుగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన సభ్యులు కోఆర్డినేటర్లు గా ఉంటారు. ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా అండర్ లో ఈ సెల్ పనిచేస్తుంది. ట్రాన్స్ జెండర్ ల రక్షణ కోసం 2019 లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన చట్టప్రకారం ఇది పనిచేస్తుంది.

ట్రాన్స్ జెండర్ లు సమాజంలో గౌరవం తో పాటుగా భద్రంగా కూడా బతకడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు స్వాతి లక్రా. మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ప్రైడ్ ప్లేస్ ని తొలి అడుగు గా అభివర్ణించారు తరుణీ వ్యవస్థాపకురాలు మమతా రఘువీర్. ట్రాన్స్జెండర్ లకు lgbt కమ్యూనిటీకి చెందిన సభ్యులకు ఉన్న హక్కుల గురించి సమాజంతో పాటు, పోలీసులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు మమతా రఘువీర్. దీంతో పాటుగానే ట్రాన్స్జెండర్ లకు కూడా తమ మీద జరుగుతున్న దాడుల గురించి ఎవరిని సంప్రదించాలనేది తెలియట్లేదని, వారికి కూడా సరైన కౌన్సిలింగ్, వేదిక ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రైడ్ ప్లేస్ ఉపయోగపడుతుందని అన్నారు ఆవిడ.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద కాస్త ఆలస్యంగా అయినా ఒక వేదిక ఏర్పాటు చేయడం పట్ల ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ యాక్టివిస్ట్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2018లో తీర్పు వచ్చి, 2019లో చట్టరూపం ఏర్పడినప్పటికీ తొలి అడుగు పడడానికి చాలా సమయం పట్టిందంటున్నారు. అయినప్పటికీ జస్టిస్ నారీమన్ జడ్జిమెంట్ ను సమాజం గుర్తించడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు ట్రాన్స్ జెండర్, ఎల్జీబీటీ కమ్యూనిటీ సభ్యులు. అయితే రావాల్సిన కొన్ని మార్పులు కూడా ట్రాన్స్ జెండర్, ఎల్జీబీటీ కమ్యూనిటీ నుంచే ఉంటాయని భావిస్తున్నారు ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ లు. గతంలోనే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2011 మార్చ్ లో ట్రాన్స్ జెండర్ ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు అయినప్పటికీ, సరైన విధంగా ట్రాన్స్ జెండర్ లు ఉపయోగించుకోలేకపోయారని అంటున్నారు. వారికున్న సమస్యల కోసం పోరాడడానికి ఒక వేదిక ఉన్న విషయం గురించి, అలాగే వారి హక్కుల కోసం అవగాహన కల్పించాల్సిన అవసరం, ప్రచారం ఇంకా పెరగాలని భావిస్తున్నారు యాక్టివిస్ట్ లు. అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కి అర్థం ఉంటుందని, హెల్ప్ డెస్క్, ప్రైడ్ ప్లేస్ లను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

Next Story