ప్రారంభమైన ప్రాణహిత పుష్కరాలు

By -  Nellutla Kavitha |  Published on  13 April 2022 2:37 PM GMT
ప్రారంభమైన ప్రాణహిత పుష్కరాలు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం అర్జున గుట్ట వద్ద పవిత్ర ప్రాణహిత పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ దంపతులతోపాటుగా, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కుటుంబ సమేతంగా ఇందులో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పుష్కరాలను అధికారికంగా ప్రారంభించారు. గోదావరి ఉపనది ప్రాణహిత పుష్కరాలు కుమరం భీం అసిఫాబాద్ జిల్లా, మంచిర్యాలలో ఈనెల 13వ తేది నుంచి 24వ తేది వరకు జరుగుతాయి.

తెలంగాణలోనే పుట్టి ఇక్కడే అంతం అయ్యే జీవనది ప్రాణహిత. కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత మొదలై కాళేశ్వరం వరకు మొత్తం 113 కిలోమీటర్లు వరకు ప్రవహిస్తున్నది. కాళేశ్వరం దగ్గర గోదావరిలో ప్రాణహిత, సరస్వతి నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. ప్రాణహిత నది ఎక్కువగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్నది.

బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశంచినపుఢు ఒక్కొక్క నదికి 12 ఏళ్ల కు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఇక మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో ప్రాణహితకు పుష్కరాలు వస్తాయి. ఈసారి చైత్రశుద్ధ ద్వాదశి అంటే ఈరోజు బుధవారం నదికి పుష్కరాలు ప్రారంభమై చైత్ర బహుళ అష్టమి 24వ తేదీన ముగుస్తాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2010లో వచ్చిన ప్రాణహిత నదికి పుష్కరాలను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట వద్ద ప్రారంభించి పుష్కర స్నానం ఆచరించారు. పుష్కర స్నానం తర్వాత క్షేత్ర దర్శనంతో పాపాలు తొలిగిపోతాయని నమ్ముతారు. ఇక మరణించిన పెద్దలకు పితృకర్మలు, పిండప్రధానాలు, వారి పేరిట దానాలు కూడా చేస్తుంటారు కుటుంబసభ్యులు. ఇందుకోసం వరంగల్‌ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 200 RTC బస్సులను నడుపనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే కాళేశ్వరం నుంచి పుష్కరఘాట్‌ వరకు 10 మినీ బస్సుల ద్వారా భక్తులకు ఉచిత ప్రయాణం కల్పించనుంది RTC.

Next Story