మళ్లీ అందుబాటులోకి ఫోన్ ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ వినియోగదారులకు ఆయా డిస్కంలు శుభవార్త చెప్పాయి.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 7:12 AM GMTమళ్లీ అందుబాటులోకి ఫోన్ ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ వినియోగదారులకు ఆయా డిస్కంలు శుభవార్త చెప్పాయి. కరెంటు బిల్లుల చెల్లింపును గతంలో మాదిరిగానే సులభంగా చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ తమ నిర్ణయాలను ప్రకటించాయి. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ చెల్లింపులకు గతంలో డిస్కమ్‌లు గుడ్‌బై చెప్పగా.. ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు అధికారు. యూపీఐల ద్వారా చెల్లించడాన్ని అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున బకాయిలు మిగిలిపోయినట్లు అధికారులు గుర్తించారు. దాంతో... విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ యాప్‌తో పాటుగా.. ఫోన్‌పే ద్వారా కరెంటు బిల్లులను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఒకప్పుడు విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించే వారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న డిస్కమ్‌లు యూపీఐ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించే అవకాశం కల్పించింది. వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే ఈజీగా చెల్లించే వారు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులు కుదరదని నెల రోజుల క్రితమే డిస్కమ్ లు నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత డిస్కమ్‌లు యూపీఐల ద్వారా చెల్లింపులను నిలిపివేశారు.
కొత్తగా టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా చెల్లింపులు చేయడంపై ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, కరెంట్ బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర మళ్లీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. చివరకు ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపుల సస్పెన్షన్ కారణంగా సీపీడీసీఎల్‌లో చెల్లింపుల బకాయిలు భారీగా ఉండడంతో ఫోన్ పే ద్వారా కూడా చెల్లింపులు పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. నాలుగైదు రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.