ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల కిందట గద్దర్ గుండెపోటుకు గురయ్యారు. దాంతో.. ఆయన అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందారు. ఆ సమయంలోనే పలువురు ప్రముఖులు గద్దర్‌ను పరామర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడంతో యావత్ తెలంగాణ ప్రజానీకం బాధను వ్యక్తం చేస్తోంది. ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన గద్దర్.. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను చైతన్యపరిచారు.
గద్దర్ 1949లో తూప్రాన్‌లో జన్మించారు. గద్దర్ అసలుపేరు గుమ్మడి విఠల్‌రావు. గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పాటలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వారికి కొత్త ఊపు తెచ్చారు. కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లును తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం కూడా జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో తెలంగాణ ఉద్యమానికి గద్దర్ ఊపు తెచ్చారు. గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు ప్రముకులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.