పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై చర్యలు..8 మందిపై సస్పెన్షన్ వేటు

పార్లమెంట్‌లో బుధవారం చెలరేగిన అలజడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  14 Dec 2023 7:30 AM GMT
parliament, security breach, tight security,

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై చర్యలు..8 మందిపై సస్పెన్షన్ వేటు 

పార్లమెంట్‌లో బుధవారం చెలరేగిన అలజడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సెక్యూరిటీని తప్పించుకుని కొందరు వ్యక్తులు పార్లమెంట్‌లో పొగను వదిలారు. ఆ సంఘటనతో ఎంపీలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఇతర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అనురాగ్‌ ఠాకూర్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు.

మరో వైపు భద్రతా వైఫల్యంపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అధికారులు చర్యలు చేపట్టారు. నిందితులు పార్లమెంట్‌లోకి వచ్చ అలజడి సృష్టించిన సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సస్పెన్షన్‌కు గురైన వారిలో విమిట్, ప్రదీప్, అనిల్, గణేశ్, వీర్, రాంపాల్, అర్వింద్, నరేందర్‌ ఉన్నట్లు సమాచారం.

లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై విపక్ష పార్టీలన్నీ సభలో ఆందోళన చేస్తున్నాయి. ఈ అంశంపైనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. వారి ఆందోళనల నడుమ కాసేపు సభకు అంతరాయం ఏర్పడింది. కొందరు సభ్యులు అయితే భద్రతా అంశంపై వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య సభను స్పీకర్ వాయిదా వేశారు. ఇటు లోక్‌సభ.. అటు రాజ్యసభ రెండింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ఈ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దీనిపై స్పీకర్‌ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. పాస్‌లు ఇచ్చే విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు.

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం సంఘటన తర్వాత సెక్యూరిటీని మరింత పెంచేశారు. పార్లమెంట్‌లోకి ప్రవేశాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎంపీలు ప్రవేశించే మకరద్వారం నుంచి ఇతరులని వెళ్లనివ్వడం లేదు. మీడియాపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ పాసులు ఉంటేనే మీడియా వారికి అనుమతి ఇస్తున్నారు. బూట్ల నుంచి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు.

Next Story