ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసలుగా చిన్నారులు.. మానసిక సమస్యలు

ఆన్‌లైన్‌ గేమ్స్‌ పిల్లల పాలిట శాపంగా మారాయి. వారికి అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  15 Sep 2024 8:59 AM GMT
ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసలుగా చిన్నారులు.. మానసిక సమస్యలు

ఆన్‌లైన్‌ గేమ్స్‌ పిల్లల పాలిట శాపంగా మారాయి. వారికి అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. చిన్నప్పుడు ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు అయినవారు పెద్దయ్యాక బెట్టింగ్, చెడు వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడులో ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లతో TNOGA ను ఏర్పాటు చేసింది. ఈ అథారిటీ రాష్ట్రంలో పలువురు విద్యార్థులను కలిసి నేరుగా మాట్లాడారు. అలాగే.. ఉపాధ్యాయులతోనూ విద్యార్థుల పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి..? వారి శారీరక, మానసిక పరిస్థితిని ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకున్నారు.

ఈ వ్యసనం ప్రమాదకర పరిస్థికి చేరిందని చెబుతూ అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఈ అథారిటీ పేర్కొంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ గేమింగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని TNOGA హెచ్చరించింది. పిల్లల ప్రవర్తన, దినచర్యలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని చెప్పింది. TNOGA సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2 లక్షల మంది విద్యార్థుల్లో 20 శాతం మంది ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలని తేలింది. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఎక్కువగా ఆడుతున్న విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలు ఏర్పడ్డాయని 67 శాతం మంది ఉపాధ్యాయులు చెప్పారు. బానిసైన విద్యార్థుల్లో తెలివితేటలు, చురుగ్గా ఆలోచించడం బాగా తగ్గిందని 74 శాతం మంది ఉపాధ్యాయులు తెలిపారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలవుతున్న పిల్లలను కాపాడేందుకు పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే చైనా, జపాన్‌లాంటి దేశాల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవస్థను నిషేధించినట్లు టీఎన్‌ఓజీఏ అధికారులు చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో మరో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రత్యేకించి ఆన్‌లైన్‌ గేమ్‌ల వ్యసనం గత ఐదేళ్లుగా ఎక్కువవుతూ వస్తోందని చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో లేకపోతే పిల్లల మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందన్నారు. తమిళనాడులో ప్రభుత్వం ఆమోదించిన గేమ్‌లోనే మార్కెట్‌లోకి వచ్చేలా TNOGA చూస్తోంది.

Next Story