అదిరిపోయే ఆఫర్..హైదరాబాద్ నుంచి విజయవాడకు టిక్కెట్ ఒక్క రూపాయే!

ఒక్క రూపాయితోనే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది ఓ ప్రయివేట్‌ కంపెనీ.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2023 5:41 AM GMT
One Rupee, Bus Journey, Nuego Company, Super Offer,

 అదిరిపోయే ఆఫర్..హైదరాబాద్ నుంచి విజయవాడకు టిక్కెట్ ఒక్క రూపాయే!

ఒక్క రూపాయికి ఏం వస్తుంది అటుంటారు చాలా మంది. అదే ఒక్క రూపాయితో బస్సు ప్రయాణం చేయచ్చు అంటే నమ్ముతారా? అది కూడా ఏకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు. అవును ఇది నిజమే. వినడానికే ఆశ్చర్యం కలిగించినా త్వరలోనే ఇది నిజం కానుంది. ఒక్క రూపాయితోనే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది ఓ ప్రయివేట్‌ కంపెనీ. ఏసీ కోచ్‌ సేవలను అందించనుంది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

న్యూగో ట్రాన్స్‌ పొర్టేషన్ ఎలక్ట్రిక్‌ కంపెనీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. ఇంటర్‌ సిటీ ఎలక్ట్రిక్‌ ఏసీ కోచ్‌ సేవలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కేవలం ఒక్క రూపాయితోనే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ప్రయాణం చేయొచ్చని న్యూగో ట్రాన్స్‌ పొర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా తెలిపారు. ర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్‌-విజయవాడ రూట్లోనే కాదు.. ఈ సేవలను ఇండోర్ - భోపాల్, ఢిల్లీ - చండీగఢ్, ఢిల్లీ - ఆగ్రా, ఢిల్లీ - జైపూర్, ఆగ్రా - జైపూర్, బెంగళూరు - తిరుపతి, చెన్నె - తిరుపతి, చెన్నై - పుదుచ్చేరి తదితర మార్గాల్లో కొనసాగనున్నట్లు తెలిపారు.

పర్యావరణ స్థిరత్వం కోసం ప్రజలను ప్రోత్సహించడంతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా లాంగ్ జర్నీ చేసేందుకు వీలు ఉంటుందని నిరూపించేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు దేవేంద్ర చావ్లా తెలిపారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. https://nuego.in/booking వెబ్ సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని కంపెనీ సీఈవో దేవేంద్ర చావ్లా సూచించారు. కాగా.. పంద్రాగస్టు ఒక్కరోజు ఉండే ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు ఇప్పటికే చాలా మంది బుకింగ్స్‌ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Next Story