ఎన్టీఆర్ రూ.100 నాణెం కావాలా..ధరెంతో తెలుసా?

NTR స్మారకంగా రూ.100 నాణెం ముద్రించిన కేంద్ర ఆర్థికశాఖ నాణెం ధరను కూడా నిర్ణయించింది.

By Srikanth Gundamalla  Published on  29 Aug 2023 4:51 AM GMT
NTR, Rs.100 Coin, Cost, Indian Govt ,

ఎన్టీఆర్ రూ.100 నాణెం కావాలా..ధరెంతో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా.. ఆయన స్మారక చిహ్నంగా రూ.100 నాణెం ముద్రించిన విషయం తెలిసిందే. ఈ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 28న రాష్ట్రపతి కార్యాలయంలో విడుదల చేశారు. అయితే.. నాణెం ధరను కూడా నిర్ణయించింది కేంద్ర ఆర్థికశాఖ.

యాభై శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌ మిశ్రమంతో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని తయారు చేసింది కేంద్ర ఆర్థికశాఖ. అయితే.. ఈ నాణెం కావాలంటే కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రూ.100 నాణెం ధరను చెక్క డబ్బాతో పాటు పొందాలంటే రూ.4,850 చెల్లించాలి. రూ.4,380 (ప్రూఫ్‌ ఫోల్డర్ ప్యాక్‌), రూ.4,050 (యూఎన్‌సీ ఫోల్డర్‌ ప్యాక్‌)గా నిర్ణయించారు అధికారులు. వెండి, రాగి మిశ్రమాలతో తయారు చేసిన ఈ నాణెం ఆగస్టు 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉదయం 10 గంటల నుంచి 'ఇండియా గవర్నమెంట్ మింట్' వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ లేదంటే హైదరాబాద్‌లోని సైఫాబాద్, చెర్లపల్లిలోని మింట్‌ విక్రయ కౌంటర్లలో ఈ నాణేన్ని నేరుగా కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు.

ఈ మేరకు హైదరాబద్‌లోని ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రం చీఫ్‌ జనరల్‌ మేనజర్‌ వీఎన్‌ఆర్‌ నాయుడు మాట్లాడుతూ.. జాతి చరిత్రపై నందమూరి తారక రామారావు చెరగని ముద్ర వేశారని అన్నారు. అలాంటి దగ్గజ వ్యక్తులకు నివాళులు అర్పిస్తూ ఇలాంటి స్మారక నాణేలను ముద్రిస్తారని చెప్పారు. ఈ నాణెం రామారావు అసాధారణ సేవలకు నివాళులర్పిస్తుందని పేర్కొన్నారు. అయితే.. ఎన్టీఆర్ అభిమానులు ఆయన స్మారక నాణేన్ని సొంతం చేసుకుని చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం కావాలని వీఎన్‌ఆర్‌ నాయుడు పిలుపునిచ్చారు. అభిమానులందరికీ అందుబాటులో ఉంచడానికి వీలుగా వ్యక్తిగత డిమాండ్లపై పరిమితులు ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నాణెం కావాలని అనుకునే వారు https://www.indiagovtmint.in/en/commemorative-coins/ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

Next Story