కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా లేదు
By - Nellutla Kavitha | Published on 13 April 2022 7:00 PM IST2022 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ లోపే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఉన్న ఎంపీ కోటాను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఎంపీల లెటర్లు పనికి రావు అంటూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నుండి కేవీలకు లేఖలు వచ్చాయి.
పార్లమెంటు సభ్యుల కోటా కింద ఒక్కొక్క ఎంపీకి పది సీట్లు కేటాయిస్తూ వస్తోంది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. ప్రతి విద్యా సంవత్సరం నిర్వహించే ప్రవేశాల్లో ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు పది మంది విద్యార్థులను సిఫార్సు చేయవచ్చు. సంబంధిత పార్లమెంటు సభ్యుడు ఉన్న నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఉంటే అక్కడ సిఫార్సు చేయవచ్చు, లేకుంటే పక్కనే ఉన్న నియోజకవర్గానికి సిఫార్సులు ఇవ్వవచ్చు. ఒకవైపు ఈ కోటను పెంచాలని ఎంపీలు డిమాండ్ చేస్తూ ఉంటే మరోవైపు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మొత్తం కోటా తొలగించడం గమనార్హం. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాలపై సభలో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది సభ్యులు పది సీట్ల సంఖ్యను పెంచాలని, మరికొంత మంది సభ్యులు తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కోటాను మొత్తానికే తొలగించింది.
ఇక కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశం పొందారు. లోక్సభతో పాటు గా రాజ్యసభ సభ్యులు కూడా సిఫార్సు లేఖలు ఇవ్వడం కుదరదు. ఒక్క లడఖ్ మినహా దేశవ్యాప్తంగా మొత్తం 1245 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోని 104 కేవీలు ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్లో 95, రాజస్థాన్లో 68, ఢిల్లీలో 41 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.