రైళ్లలో బిర్యానీ తిన్న తొమ్మిది మందికి తీవ్ర అస్వస్థత
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌తో పాటు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిన్న తొమ్మిది మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 6:28 AM GMTరైళ్లలో బిర్యానీ తిన్న తొమ్మిది మందికి తీవ్ర అస్వస్థత
భారతీయ రైల్వేల్లో రోజూ చాలా మంది ప్రయాణం చేస్తుంటారు. అయితే.. వీటిల్లో ఆహార సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది రైల్వేశాఖ. అయితే.. కొందరు ప్రయాణికులు రైళ్లలో అమ్మిన బిర్యానీ కొని తిన్నారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ప్రస్తుతం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌తో పాటు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిన్న తొమ్మిది మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పాట్నా ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (22644)లో ఈ సంఘటన జరిగింది. పాట్నా నుంచి తమిళనాడులోని సేలంకు వెళ్తున్న 15 మంది భవన నిర్మాణ కార్మికులు విశాఖ రైల్వే స్టేషన్‌లో బిర్యానీలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని తినేశారు. అరగంట సేపటికే 15 మందిలో ఐదుగురికి అస్వస్థత మొదలైంది. వాంతులు, విరేచనాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మిగతావారు గమనించారు. దాంతో.. వెంటనే రైలు మదద్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రైల్వే అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం వేచిచూశారు. రైలు అక్కడికి చేరుకోగానే ఐదుగురిని 108 ఆస్పత్రిలో రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు.
ఇదిలా ఉంటే మరో సంఘటన దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ (22504)లో జరిగింది. అసోంలోని హోజ్జయ్ నుంచి కేరళలోని పాలక్కడ్‌కు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులు.. విశాఖ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రైలులో ఎగ్ బిర్యానీలు కొనుగోలు చేశారు. వాటిని తిన్న కాసేపటికే వారిలో నలుగురికి వాంతులు అయ్యాయి. అంతేకాద.. తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. వీరుకూడా రైల్‌మదద్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రైలు రాజమండ్రికి చేరుకోగానే.. పోలీసు సిబ్బంది బాధితులను 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స తర్వాత అందరూ కోలుకున్నారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం వారంతా మరో రైళ్లలో వెళ్లిపోయారు. కాగా.. విషతుల్యమైన ఆహారం తినడం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. రైళ్లలో నాణ్యత లేని ఆహారాన్ని అమ్మడం పట్ల.. అలాగే.. రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉంటోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.