ఆన్‌లైన్ ఫుడ్‌ ఆర్డర్లకు జోష్‌.. నిమిషానికి 1,244 బిర్యానీలు

అందరూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశారు. న్యూఇయర్ సందర్భంగా అన్ని చోట్లా సంబరాలు మిన్నంటాయి.

By Srikanth Gundamalla  Published on  2 Jan 2024 7:28 AM GMT
new year, biryani order, online food, swiggy, zomato,

 ఆన్‌లైన్ ఫుడ్‌ ఆర్డర్లకు జోష్‌.. నిమిషానికి 1,244 బిర్యానీలు

అందరూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశారు. న్యూఇయర్ సందర్భంగా అన్ని చోట్లా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా వేడుకలు అంటే మందుపార్టీలతో పాటు.. రకరకాల ఆహారం ఉంటుంది. చాలా మంది ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లకే మొగ్గు చూపిస్తున్న కాలమిది. ఇక న్యూఇయర్ సందర్భంగా కూడా ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లకు జోష్‌ పెరిగింది. ఈ మేరకు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్‌ డెలివరీ కంపెనీలు రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించాయి.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ సంస్థ వెల్లడించింది. దాదాపుగా ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని చెప్పింది. ఇక న్యూఇయర్‌ రోజు చివరి గంటలో అయితే పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయని చెప్పింది. 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించారనీ ఆ కంపెనీ సీఈవో రోహిత్ కపూర్ వెల్లడించారు. మరోవైపు జొమాటోలో 2015-2020 మధ్య ఎన్ని ఆర్డర్లు బుక్ అయ్యాయో.. అన్ని ఆర్డర్లు ఒక్క 2023 డిసెంబర్‌ 31వ తేదీనే వచ్చాయని తెలిపింది. దాదాపు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్టనర్లు ఈ ఆర్డర్లను బట్వాడా చేశారని కంపెనీ వివరించింది.

అంతేకాదు.. కొత్త ఏడాది వేడుక సమయంలో ప్రతి గంటలకు 1,722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చాయనీ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వివరించింది. అదేవిధంగా డిసెంబర్ 31న రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళదుంపల ఆర్డర్స్ వచ్చాయని పేర్కొంది. న్యూఇయర్ సందర్భంగా ఓయో రూమ్‌ బుకింగ్స్‌ కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి 37 శాతం అధికంగా అంటే.. 6.2 లక్షల రూమ్‌ బుకింగ్స్ జరిగినట్లు తెలిపారు. కేవలం డిసెంబర్ 30, 31 తేదీల్లో 2.3 లక్షల ఓయో రూమ్స్ బుక్‌ అయినట్లు నిర్వాహకులు తెలిపారు. అయోధ్యలో గత ఏడాదితో పోలిస్తే 70 శాతం అధికంగా, గోవాలో 50 శాతం, నైనీతాల్‌లో 60 ఎక్కువగా రూమ్స్ బుక్ అయినట్లు ఓయో వెల్లడించింది.

Next Story