ఇవాళ్టి నుంచి ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు
ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబందనలు అమల్లోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 10:15 AM IST
ఇవాళ్టి నుంచి ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు
ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబందనలు అమల్లోకి వచ్చాయి. ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త నిబంధనల్లో భాగంగా ఫాస్టాగ్ ఖాతాల్లో ప్రజలు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వాహనదారులకు టోల్‌ప్లాజాల వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అవుతుందని కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాల్లో కచ్చితంగా జాగ్రత్తలు వహించడం మంచిది.
ఫాస్టాగ్‌కి రూల్స్‌లో భాగంగా కేవైసీ ప్రాసెస్‌ను అప్‌డేట్ చేయాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను తప్పకుండా మార్చాల్సి ఉంటుంది. దీని కోసం ఫాస్టాగ్ యూజర్లు తన ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేసుకోవాలి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంది. యూజర్లు, కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్‌డేషన్ ప్రక్రియను అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుందని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.
ఫాస్టాగ్ ఖాతా వాహనం, వాహన యజమాని ఫోన్ నంబర్‌కు లింక్ చేయాలి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఖాతాను లింక్ చేయడం కూడా అవసరం. దీనికోసం వాహనం ముందు, పక్క ఫొటోలను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆగస్టు 1న లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసే వారు వాహనం కొనుగోలు చేసిన 3 నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.