వెంకటేశ్, రానాకు షాక్.. కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబానికి నాంపల్లి కోర్టులో షాక్ ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 11:44 AM ISTవెంకటేశ్, రానాకు షాక్.. కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబానికి నాంపల్లి కోర్టులో షాక్ ఎదురైంది. వెంకటేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్ సహా సోదరుడు దగ్గుబాటి సురేశ్‌బాబుపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. నందకుమార్ అనే వ్యక్తి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చేశారని నందకుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దగ్గుబాటి వెంకటేశ్ సహా అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
గత కొన్ని నెలలుగా హైదరాబాద్ ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ వ్యవహరంలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు, నందకుమార్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా డెక్కన్ కిచెన్‌ను కూల్చేశారని నందకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ హోటల్‌ను కూల్చేయించారని కోర్టుకు చెప్పాడు నందకుమార్. 60 మంది వరకు ప్రయివేట్ బౌన్సర్లను పెట్టి హోటల్‌ను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. రూ.20 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పిటిషన్‌లో నందకుమార్ పేర్కొన్నాడు.
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందకుమార్ ఈ మేరకు నాంపల్లి కోర్టును కోరాడు. దాంతో.. నందకుమార్ పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దగ్గుబాటి వెంకటేశ్‌తో పాటు రానా, సురేశ్‌బాబు, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ 448, 452, 380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.