ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కవితను ఈడీ కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఆమెను అధికారులు విచారిస్తున్నారు. ఇక ఇదే కేసులో గతంలో ఈడీ అధికారులు తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కవితను అధికారులు అరెస్ట్ చేయడంతో.. రిట్ పిటిషన్‌పై విచారణ అవసరం లేకుండా పోయింది. దాంతో.. ఆ రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఈ వివరాలను న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు.
ఇక కవిత తరఫు న్యాయవాది విజ్ఞప్తితో రిట్ పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని న్యాయవాది విక్రమ్ చౌదరి వెల్లడించారు. ఈడీ జారీ చేసిన సమన్లనపై సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత తరఫున సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈడీ దర్యాప్తు సంస్థ తనని అక్రమంగా అరెస్ట్ చేశారనీ.. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.