సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 March 2024 6:43 AM GMTసుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కవిత ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈడీ అధికారులు తనని అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోత్తర న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనని అరెస్ట్ చేశారనీ.. దర్యాప్తు సంస్థ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోము అని కోర్టుకు చెప్పారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కానీ.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా.. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. విచారణను అధికారులు వీడియో రికార్డు చేశారు. ఇక విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు, కవిత భర్త అనిల్ తో పాటు న్యాయవాది కలిశారు. సోమవారం ఎమ్మెల్సీ కవితను సమీప బంధువులు, ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు కలిసే అవకాశం ఉంది.