సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  22 March 2024 6:00 AM
mlc kavitha, liqour scam case, supreme court ,

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. వారు కవితను విచారిస్తున్నారు. అయితే.. ఈ కేసులో ఊరట కోసం ప్రతయత్నిస్తోన్న కవితకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టు శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ చేయలేమని చెప్పింది. రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండదని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టును ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది.

రిట్‌ పిటిషన్‌లో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన అంశాలను విజయ్‌ మదన్‌ లాల్‌ కేసుతో కలిపి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో పిటిషనర్‌ కవిత ట్రయల్‌ ఎదుర్కొని తీరాల్సిందే అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసం తేల్చి చెప్పింది. అయితే.. కవిత వేసిన రిట్‌ పిటిషన్‌కు సంబంధించి ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే బెయిల్ కోసం ట్రయల్‌ కోర్టులోనే పిటిషన్‌ వేయాలని కవిత తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అదే సమయంలో పిటిషనర్‌ మహిళ కాబట్టి ట్రయల్ కోర్టులో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. డిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ ప్రవేశపెట్టింది. ఆమెకు రిమాండ్‌ విధించడంతో కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే ఉంది. ఈ రిమాండ్ ఈ నెల 23వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కవిత తిరిగి రౌస్‌ అవెన్యూ కోర్టులోనే పిటిషన్ వేయాల్సి ఉంటుంది.

Next Story