అక్బరుద్దీన్ పై హేట్ స్పీచ్ కేసులు కొట్టేసిన కోర్టు

By -  Nellutla Kavitha |  Published on  13 April 2022 9:34 AM GMT
అక్బరుద్దీన్ పై హేట్ స్పీచ్ కేసులు కొట్టేసిన కోర్టు

అక్బరుద్దీన్ కు నాంపల్లి కోర్టు ఊరటనిచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసును కొట్టివేసింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కొట్టివేస్తూ కోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. అక్బరుద్దీన్ ఒవైసీ పై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవనే కారణంతో ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు

తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్‌, నిర్మల్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్బరుద్దీన్‌ పై కేసు నమోదైంది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. గతంలో ఈ కేసులో అరెస్టైన అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు బుధవారం తుది తీర్పు వెల్ల‌డించింది. మంగళవారం తుదితీర్పు వెలువరించాల్సి ఉండగా, అనూహ్యంగా తీర్పును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

బుధవారం ఈ మేరకు తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు, కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, ఆ వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని వ్యాఖ్యానించింది. అలాగే కేసు కొట్టివేసినంత మాత్రానా సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేసారు.

Next Story