రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం నా అదృష్టం: చిరంజీవి

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది.

By Srikanth Gundamalla  Published on  22 Jan 2024 4:47 AM GMT
megastar chiranjeevi, ayodhya, ram mandir,

రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం నా అదృష్టం: చిరంజీవి

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. ఇందుకుగాను ఆలయ ట్రస్టు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. వేల మంది ప్రముఖులకు అయోధ్య రామమందిర ట్రస్టు అధికారులు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు చాలా మంది భక్తులు కూడా క్యూ కడుతున్నారు. అయితే.. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్‌ అయోధ్యకు వెళ్లారు.

అయోధ్య ఎయిర్‌పోర్టులో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కుటుంబానికి అధికారులు ఘనస్వాగతం పలికారు. పలువురు వారికి శాలువ కప్పి వెల్‌కమ్‌ చెప్పారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం రావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశం తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెప్పారు. తన ఇష్టదైవం హనుమంతుడే ఈ ఆహ్వానం పంపినట్లుగా భావిస్తున్టన్లు చిరంజీవి చెప్పారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందనీ.. తనకు ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇదంతా భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు.


అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు అంతా హాజరు అవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయోధ్యకు వెళ్లారు. 500 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఈ కల నిజమవుతుండంతో యావత్‌ హిందూ ప్రజానీకం అంతా అపూర్వ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది.

Next Story