చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రపతిని కలిసిన నారా లోకేశ్
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరారు.
By Srikanth Gundamalla Published on 26 Sep 2023 11:38 AM GMTచంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రపతిని కలిసిన నారా లోకేశ్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. ఏపీ ప్రభుత్వమే కావాలని తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఈ కేసులో ప్రస్తుం బెయిల్ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి మద్దతు కూడగట్టేందుకు ఆయన తనయుడు నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పెద్దల నుంచి మద్దతు కోరుతున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు.
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరారు. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి రాష్ట్రపతితో సమావేశం అయ్యారు లోకేశ్. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లోకేశ్ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పాలన.. ప్రతిపక్షాల అణచివేతపై ద్రౌపది ముర్ముకి వివరించారు.
ఏపీలో సీఎం జగన్ పాలన అరాచకాలమయం అని, విపక్షాలను అణచివేస్తున్నారని లోకేశ్ రాష్ట్రపతికి వివరించారు. 2019 నుంచి ఏపీలో ప్రతిపక్షాలపై జరుగుతున్న అరచకాలను రాష్ట్రపతి వివరించామని లోకేశ్ తెలిపారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన అంశాలను వివరించారు. చంద్రబాబు 45 ఏళ్ల పాటు ప్రజాసేవలోనే ఉన్నారని చెప్పారు. అలాంటిది చంద్రబాబుని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలుకు పంపారని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని.. తమ వద్ద ఉన్న ఆధారాలు అన్నీ రాష్ట్రపతికి అందించామని లోకేశ్ చెప్పారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలను అణచివేసి ధోరణిని వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తోందని చెప్పారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినా కూడా జైలుకు పంపుతున్నారని అన్నారు లోకేశ్. తాను యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని చెప్పిన తర్వాత రోజే తనపై ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు బనాయించారని రాష్ట్రపతికి లోకేశ్ వివరించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావడం లేదన్నారు. అయితే.. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా కలిసి ఏపీలో పరిస్థితులపై వివరించామని లోకేశ్ తెలిపారు. రాబోయే రోజుల్లో జగన్‌కు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని నారా లోకేశ్ అన్నారు.