జూన్ 4న ఎలక్షన్స్‌ రిజల్ట్‌.. మూవీ థియేటర్లలో లైవ్‌ స్క్రీనింగ్‌..!

దేశ ప్రజల అందరిలో కూడా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆసక్తి ఉంది.

By Srikanth Gundamalla  Published on  1 Jun 2024 1:55 AM GMT
lok sabha election, results, live screening,  theaters ,

 జూన్ 4న ఎలక్షన్స్‌ రిజల్ట్‌.. మూవీ థియేటర్లలో లైవ్‌ స్క్రీనింగ్‌..!

వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు ఉత్కంఠగా ఉన్నప్పుడు.. సినిమా థియేటర్లలో ప్రేక్షకుల కోరిక మేరకు లైవ్‌ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తారు. ఇక తాజాగా దేశ ప్రజల అందరిలో కూడా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆసక్తి ఉంది. దాంతో.. ఎన్నికల ఫలితాలను కూడా లైవ్‌గా థియేటర్లలో స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో ఏడు విడతల్లో సుదీర్ఘంగా ఎన్నికల పోలింగ్ కొనసాగింది. శనివారం చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇక జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వనున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను సినిమా థియేటర్లలో లైవ్‌ ప్రదర్శించాలని మహారాష్ట్రలోని కొన్ని థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఎస్‌ఎం 5 కల్యాణ్, సియాన్, కంజూర్ మార్గ్‌లోని మూవీ మ్యాక్స్‌ థియేటర్లు, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, నాగ్‌పూర్‌లోని మూవీ మ్యాక్స్‌ ఎటర్నిటీ, పుణెలోని మూవీ మ్యాక్స్‌ వంటి థియేటర్లలో సిల్వర్‌ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలను లైవ్‌ స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆయా థియేటర్లలో పెద్ద స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలను వీక్షించాలనుకునే వారి కోసం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారని సమాచారం. ఆరు గంటల పాటు ఫలితాలను ప్రసారం చేయనున్నారు. టికెట్‌ ధరలను కూడా రూ99 నుంచి రూ.300 వరకే ఉన్నాయట. జనాలు కూడా థియేటర్లలో ఎన్నికల ఫలితాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారనీ.. ఈ క్రమంలో కొన్ని థియేటర్లలో టికెట్లు అన్ని అమ్ముడు పోయినట్లు ఆయా థియేటర్ల వర్గాలు చెబుతున్నాయి.

Next Story