అమల్లో ఎన్నికల కోడ్.. అంతకు మించిన డబ్బుతో వెళ్తే ఇక అంతే..!
కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ తోపాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 March 2024 11:08 AM GMTఅమల్లో ఎన్నికల కోడ్.. అంతకు మించిన డబ్బుతో వెళ్తే ఇక అంతే..!
కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ తోపాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు రవాణా చేయడానికి వీలు ఉండదు. పెళ్లి అయినా, పేరంటమైనా.. ఇతర ఏ పనుల కోసం అయినా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు పట్టుకెళ్తూ పట్టుబడితే అంతే సంగతులు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నగదుతో పాటు ఇతర విలువైన వస్తువుల తరలింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. తగు అనుమతులు, డాక్యుమెంట్లను తీసుకునే నగదు తరలించాలని సూచిస్తున్నారు. రూ.50వేలకు మించి నగదును తరలించేందుకు అనుమతులు లేవని చెబుతున్నారు. అలా తరలించినట్లు అయితే దాన్ని సీజ్ చేస్తామని ఎన్నికల అధికారులు, పోలీసులు చెబుతున్నారు. కాగా.. జూన్ 6తో ఎన్నికల కోడ్ పూర్తవుతుంది. అంటే మొత్తం 80 రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. తెలంగాణలో మే 13న ఎన్నికలు పూర్తయినప్పటికీ ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.
ఈ క్రమంలోనే పోలీసులు పట్టణాలు, మండలాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే దానిని సీజ్ చేస్తారు. అలా ఒకవేళ నగదు సీజ్ చేస్తే దాన్ని రిటర్న్ తెచ్చుకోవడానికి చాలా ప్రాసెస్ పడుతుంది. నగదు, నగల తరలింపునకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు చూపించగలిగితే వాటిని వెనక్కు తెచ్చుకోవచ్చని అధికారులు వివరించారు. అందుకే పెద్ద మొత్తంలో నగదుతో తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు.