ప్రజలు ఈ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 6:36 AM ISTతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. గత మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వరద పోటెత్తింది. చెరవులు అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే. చాలా చోట్ల రహదారులపైకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారులపై సైతం వరద పోటెత్తడం ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలోనే విజయవాడ, ఖమ్మం రూట్లలో ప్రయాణించాలనుకునే నగర ప్రజలు.. అలాగే హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రజలు ఈ రూట్లలో ప్రయాణ వాయిదా వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి. విశ్వనాథ్ పలు సూనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే మాత్రం చౌటుప్పల్, నార్కెట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని ఆయన సూచించారు. ఇక ఖమ్మం వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మర్రిపేట బంగ్లా మీదుగా వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే పోలీసులు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 90102 03626 నంబరును సంప్రదించాలని సూచించారు. కాగా.. చిల్లకల్లు, నందిగామ దగ్గర జాతీయ రహదారిపైకి నీళ్లు వచ్చాయి. పాలేరు నది పొంగడం, సూర్యపేట తర్వాత రామాపురం క్రాస్‌రోడ్డు బ్రిడ్జి కూలిందని ఆయన చెప్పారు. భద్రత కారణాల రీత్యా ఖమ్మం, విజయవాడ రూట్లలలో ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు చెబుతున్నారు.