ఈ బియ్యం కిలో రూ.15వేలు.. ప్రయోజనాలు అలా ఉన్నాయ్‌ మరి!

సాధారణంగా బియ్యం ఒక కిలో రూ.50 వరకు ఉంటుంది.

By Srikanth Gundamalla  Published on  20 Sept 2024 2:41 PM IST
ఈ బియ్యం కిలో రూ.15వేలు.. ప్రయోజనాలు అలా ఉన్నాయ్‌ మరి!

సాధారణంగా బియ్యం ఒక కిలో రూ.50 వరకు ఉంటుంది. కానీ.. ఈ బియ్యం ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్‌ అవుతారు. కిలో బియ్యం ఏకంగా 15వేల రూపాయలు అట. ఆ రైస్‌ ప్రయోజనాలు తెలుసుకున్నాక.. ఇంత ధర ఉంటుందులే అని కూడా అనుకుంటారు. ఈ బియ్యం జపాన్‌లో పండిస్తారు. దీనికి కిన్మైమై అని పేరు పెట్టారు. ఈ బియ్యం మనం తినే సాధారణ రైస్‌లాగే ఉంటుంది. ఈ కిన్మెమై బియ్యం ప్రత్యేకత ఏంటంటే వీటిని కడగాల్సిన అవసరమే లేదంటున్నారు. నిజానికి బియ్యం చాలా మంది ఒకటికి రెండుసార్లు కడుగుతుంటారు. ఇంకొందరు మరిన్ని ఎక్కువసార్లే నీటితో శుభ్రం చేస్తుంటారు. కానీ.. ఈ కిన్మైమై రైస్‌ను మాత్రం నేరుగా పొయ్యిపై పెట్టేసుకుని వండుకోవచ్చట. ఇలా చేయడం ద్వారా చాలా వరకు నీటిని ఆదా చేసిన వాళ్లం అవుతామని చెబుతున్నారు నిపుణులు.

కిన్మైమై రైస్ చూడటానికి సాధారణ బియ్యం లాగే ఉన్నా.. వీటిని ప్రత్యేకమైన ప్రాసెసింగ్ విధానాల్లో పండిస్తారు. ఇక ఈ బియ్యం పండించడానికి కావాల్సిన ప్రత్యేక టెక్నాలజీపై జపాన్ పేటెంట్ కూడా పొందింది. కిన్మైమై రైస్ రుచితోపాటు మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నింటినీ అందిస్తుందని చెబుతున్నారు. ఈ రైస్‌ చాలా స్వీట్‌గా ఉంటుంది. అలాగో పోషకాలు కూడా ఎక్కువే. మనం తినే బియ్యం కంటే పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. కిన్మైమై బియ్యం తెల్లగా ఉంటుంది. కానీ.. బ్రౌన్‌ రైస్‌ అందించే ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన చెస్ట్‌నట్‌ రంగు ఉన్నతమైన పోషకాహార ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాదు ఒక్కసారి పొయ్యిపై పెడితే చాలా తొందరగా ఉడికిపోవడం ఈ కిన్మెమై బియ్యం మరో ప్రత్యేకత.

తెలుపుతో పాటుగా గోధుమ రంగులో కూడా ఈ కిన్మెమై బియ్యం లభిస్తుంది. సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఫైబర్‌.. ఏడు రెట్లు విటమిన్‌ బీ1 కలిగి ఉంటుంది. ఈ బియ్యం తీసుకోవడం వల్ల ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొనడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. 6 రెట్లు లిపోపాలిసాకరైడ్‌లును కలిగి ఉంటుంది. ఇది ఫ్లూ, ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్‌, డిమెన్షియా వంటి వ్యాధులతో పోరాడే రోగనిరోధక వ్యవస్థకు బూస్టర్‌గా పనిచేస్తుంది. కిన్మెమై బియ్యం కడుపు ఉబ్బరం, అజీర్ణం తదితర సమస్యలకు చెక్‌ పెడుతుందట. కిన్మెమై బియ్యం కిలో ధర రూ.15 వేలు పలుకుతోంది. ఇదే అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డు సాధించింది. జపాన్‌లో ఈ బియ్యాన్ని ఒక పెట్టెలో 140 గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్‌ చేసి విక్రయిస్తుంటారు. ఈ పెట్టె ధర రూ. 13000 ఉంటుంది.

Next Story